వైరల్‌గా.. చిన్నోడి ఫుడ్ ఆర్డర్ బిల్

117

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత టెక్ యుగంలో ఆరు నెలల పసి పిల్లలు కూడా సెల్‌ఫోన్ పట్టుకు ఆడేస్తున్నారు. ఏడాది వచ్చేసరికి రైమ్స్ పెట్టకుంటే తినమని మారాం చేస్తున్నారు. ఏడాదిన్నరకే సెల్‌ఫోన్ ఆపరేట్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నాలుగేళ్ల బుడ్డోడు తల్లి ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. దాని బిల్లు రూ. 5500/- అయ్యిందని, వాళ్ల అమ్మ ఇన్‌స్టాలో ఆర్డర్ లిస్ట్ పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫుడ్ ఆర్డర్ కాస్త వైరల్‌గా మారింది.

ప్రస్తుత ఇన్‌స్టాంట్ యుగంలో ఏ ఫుడ్ తినాలన్నా.. క్షణాల్లో ఇంటి ముందరకు కాదు, మన చేతుల్లోకే వచ్చేస్తుంది. అయితే ఈ చిన్నోడు వాళ్ల అమ్మ ఫోన్ తీసుకుని తనకు నచ్చింది ఆర్డర్ చేసుకున్నాడు. తీరా వాళ్లమ్మ వచ్చి బిల్ చూస్తే.. 400 బ్రెజిలియన్ రియాల్స్ (రూ.5523) అని కనిపించింది. అంతే ఆమె ఒక్కసారిగా షాకైంది. తన కొడుకు చేసిన పనిని సోషల్ మీడియాలో వివరించింది.

‘ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. నేను ఐఫుడ్ కార్డ్ తీసుకున్నాను. అయితే అది ఇంట్లోనే మర్చిపోయాను. దాంతో నా కొడుకు 6 బర్గర్ మీల్స్, 6 హ్యాపీ స్నాక్స్, 8 ఎక్స్‌ట్రా టాయ్స్, 2 చికెన్ నగెట్స్ బిగ్ పోర్షన్స్, ఫ్రెంచ్ ప్రైస్ విత్ బకోన్ అండ్ చెద్దార్, 10 ఓవోమాల్టైన్ మిల్క్ షేక్స్, 2 టాప్ సండే స్ట్రాబెర్రీ, 2 యాపిల్ టార్టెలెట్స్, 2 మ్యాక్‌ఫ్లరీ, 8 వాటర్స్, 1 గ్రేప్ జూస్, 2 ఎక్స్ ట్రా సాసెస్ ఆర్డర్ చేశాడు. ఇది చూసి నేను నవ్వుకున్నాను, ఏడ్చాను. ఇక చేసేదేం లేక ఆ ఫుడ్‌ను తినేశాం కూడా. చాలా మంది‌ దీని గురించి చెప్తున్నా నమ్మడం లేదు’ అని ఆమె పోస్టు చేసింది. దాంతో ఆమె పోస్ట్ నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఆ చిన్నోడు ఇలాంటి ఆర్డర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.