తెలంగాణ సర్కార్‌లో చక్రం తిప్పుతున్న ‘బీహారీ’ బ్యాచ్.. అరవింద సమేత సుల్తాన్ టీం..

by  |
తెలంగాణ సర్కార్‌లో చక్రం తిప్పుతున్న ‘బీహారీ’ బ్యాచ్.. అరవింద సమేత సుల్తాన్ టీం..
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర పరిపాలనలో అరవింద సమేత సుల్తాన్​పర్వం నడుస్తున్నది. ఇద్దరు సీనియర్​ఐఏఎస్‌లు తెలంగాణ పరిపాలన వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధాన శాఖలకు సారథ్యం వహిస్తున్న ఆ ఇద్దరు కనుసన్నల్లోనే కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. బీహార్‌కు​చెందిన ఇద్దరు అధికారులకు ప్రభుత్వ చీఫ్​సెక్రటరీ అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. తెలంగాణతోపాటు మిగతా ప్రాంతాల వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తితో ఉన్నతాధికారులు రగిలిపోతున్నారు.

తెలంగాణ ఆత్మతో పనిచేస్తున్న వారికి, ఇతర అణగారిన కులాలకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు ఐఏఎస్‌లు ఇప్పటికే బహిరంగంగా ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తెలంగాణకు చెందిన సమర్థులైన అధికారులు బీహార్​బ్యాచ్​ఆధిపత్యంలో డీ మోరలైజ్ అవుతున్నారు. తామేమైనా తప్పు చేస్తున్నామా? అన్న భావన వారిని వేధిస్తున్నది. సమర్ధత కంటే విధేయత, ప్రాంతీయతకే అగ్రపీఠం వేస్తున్నారని ఉన్నతాధికారుల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది.

అరవింద సమేత..

సీనియర్ ఐఏఎస్​అధికారి అరవింద్​కుమార్​రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. స్పెషల్​చీఫ్ సెక్రటరీగా ఆయన పలు శాఖలకు సారథ్యం వహిస్తున్నారు. అత్యంత కీలకమైన శాఖ మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్‌తో పాటు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్‌గానూ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన మరో రెండు ప్రధాన శాఖలకూ సారథ్యం వహిస్తున్నారు. వాస్తవానికి మున్సిపల్​ అడ్మినిస్ర్టేషన్ వ్యవహారాలు చక్కదిద్దడానికే సమయం సరిపోదు. దానికి తోడుగా అత్యంత ప్రాధాన్యమైన ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా బిజీ బిజీగా ఉంటున్నారు.

ఇదీ చాలదన్నట్లు ఆయనకు హోదాకు తగని హైదరాబాద్​మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) కమిషనర్‌గా బాధ్యతలను అప్పగించారు. అక్కడ ఆయన సరైన సమయం కేటాయించకపోవడంతో వందలాది ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. అదీ కాకుండా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్​ఇన్‌ఫ్రాస్ట్రక్చర్​డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీయుఎఫ్‌ఐడీసీ) ఎండీగానూ కొనసాగుతున్నారు. మూడేండ్లు దాటినా ఆయన ఎదురులేకుండా తన పరిపాలనను కొనసాగిస్తున్నారు. అరవింద్​కుమార్‌కు కీలకమైన మంత్రి అండదండలుండటంతో ఆడిందే ఆట.. కోరుకున్నదే పాట అన్న చందంగా పరిస్థితి తయారైందని పలువురు అధికారులంటున్నారు.

సర్కార్‌లో సుల్తాన్..

సందీప్​కుమార్ సుల్తానియా.. ఇప్పుడు ఆయన చాలా ప్రభుత్వ శాఖలకు ‘‘సుల్తాన్’’​​గా మారారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువ శాఖలకు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఐఏఎస్‌లలో ఆయనదే అగ్రస్థానం. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ శాఖ ఉన్నతాధికారి సీటు ఖాళీ అయినా ఆ బాధ్యతలను చేపడుతున్నారు. వాస్తవానికి పంచాయతీరాజ్​ శాఖ వ్యవహారాలను చక్కదిద్దడానికే సమయం చాలదు. ఆయనకు ఏకంగా 8 కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు.

ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, విద్యుత్​శాఖ వంటి కీలకమైన శాఖలకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న​సుల్తానియాకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. పెద్ద శాఖలు చాలవన్నట్లు రాష్ట్రంలో ఏ కీలక పోస్టు ఖాళీ అయినా ఆయనకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. తెలంగాణ పవర్​ఫైనాన్స్​కార్పొరేషన్​ఎండీగా, ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా, సింగరేణి ఇంచార్జీ సీఎండీగా, సొసైటీ ఫర్​ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) సీఈవోగా.. ఇలా ఎన్నో శాఖలకు ఆయన పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో ఉన్నారు.

సీఎస్ సోమేశ్​కుమార్‌కు ఆయన నమ్మిన బంటుగా కావడమే ఇందుకు కారణమని పలువురు ఐఏఎస్‌లు చెబుతున్నారు. సందీప్​కుమార్ సుల్తానియా 1992 బీహార్ బ్యాచ్‌కు చెందిన అదికారి. ఏ కీలక పోస్టు ఖాళీ అయినా ఆయనకే కట్టబెడుతుండటం గమనార్హం. ఫుల్ అడిషనల్​చార్జీని అప్పగించడంతోపాటు తగిన పారితోషికాన్ని కూడా ఇస్తున్నారు. ఆయనలో అంత ప్రతిభ ఏముంది? అసలు కారణమేమిటి? అని సీనియర్​ ఐఏఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సీఎస్ సోమేశ్​కుమార్ రెవెన్యూ, సీసీఎల్ఎతో పాటు వాణిజ్యపన్నుల వంటి పలు కీలక బాధ్యతలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందిన అధికారుల చేతిలో చాలా కీలకమైన శాఖలున్నాయని ఇతర ప్రాంతాల సీనియర్ ఐఏఎస్​అధికారులు లోలోపల రగిలిపోతున్నారు. పదవులను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక సిన్సియర్ సీనియర్ ఐఏఎస్​అధికారి తనకు జరుగుతున్న అవమాన భారాన్ని తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. తెలంగాణకు సంబంధం లేనివారికి ప్రాధాన్యం ఇస్తూ అణగారిన వర్గాల వారిని విస్మరిస్తున్నారన్న అసంతృప్తితో గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ స్వచ్ఛందంగా పదవీ విరమణ ప్రకటించడం సంచలనం సృష్టించింది. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి వివక్షను ప్రశ్నిస్తూ రాజకీయ జెండాను ఎగురవేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో కొందరి పెత్తనానికి ఇంకా బ్రేక్​పడలేదు.


Next Story