ఆంధ్రా దాదాగిరి.. తొలిసారి నోరు విప్పిన కేసీఆర్

by  |
ఆంధ్రా దాదాగిరి.. తొలిసారి నోరు విప్పిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం మరో మలుపు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ‘దాదాగిరి’ అని పోల్చడంతో ఆ రాష్ట్రం కూడా ఘాటుగానే స్పందించింది. గెజిట్ విడుదల చేసి రెండు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై పెత్తానాన్ని బోర్డులకు కట్టబెట్టడంతో కేంద్రంపై కూడా కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నదని ఆరోపించారు. గెజిట్ విడుదలై నెల రోజులైనా ఇప్పటివరకూ ఎలాంటి కామెంట్ చేయని సీఎం కేసీఆర్ ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌ను, కేంద్రాన్ని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.

కృష్ణా, గోదావరి బేసిన్‌లలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి నియంత్రణను ఆ నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ జారీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా గొంతెత్తడం ఇదే తొలిసారి. గెజిట్‌పై ఇప్పటివరకూ సమీక్షలు, అధికారుల మాటలే తప్ప సీఎం పెదవి విప్పలేదు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులను వివరించడానికి సోమవారం హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో ఆంధ్రప్రదేశ్ దాదాగారి చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నదని ఘాటైన కామెంట్లు చేయడం గమనార్హం.

చర్చల ద్వారా రెండు రాష్ట్రాలూ జల వివాదాలను పరిష్కరించుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన చేయడం, అవసరమైతే రాజ్యాంగ పరిధిలో మధ్యవర్తిత్వం వహిస్తానని వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే కేసీఆర్ ఇలా స్పందించడం విశేషం. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ కూడా వెంటనే స్పందించింది. కృష్ణా జలాల వివాదాన్ని ఎవరు సృష్టించారో అందరికీ తెలుసునని, ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారని ఆ రాష్ట్ర ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా, కృష్ణా నది యాజమాన్య బోర్డు లిఖితపూర్వకంగా చెప్పినా పెడచెవిన పెట్టిన తెలంగాణ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి 30 టీఎంసీల నీటిని సముద్రంపాలు చేసిందన్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామనే భావనతో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జల వివాదాన్ని సష్టించిందని, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వాటాను కాపాడుకోడానికే ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించారని అన్నారు.

మా ప్రయత్నం మేం చేసుకుంటాం : కేసీఆర్

కృష్ణా నీళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు కడుతూనే తెలంగాణను తప్పు పడుతున్నదంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో కృష్ణా నీళ్ళలో ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నదని, ఇకపైన జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. నీటి కోసం గోసపడిన తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలేరు నుంచి గోదావరి నీళ్ళను కృష్ణా బేసిన్‌కు తరలించుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోక తప్పదని అన్నారు. పాలేరు నుంచి నల్లగొండ జిల్లాలోని పెద్ద దేవులపల్లికి గోదావరి నీటిని అనుసంధానం చేసే ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. ఈ కారణంగా రానున్న రోజుల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు పెరుగుతుందని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

గోదావరి బోర్డు మీటింగ్‌కు హాజరు అనుమానమే

గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రాజెక్టుల ఆపరేషన్‌కు సంబంధించి వీలైనంత తొందరగా రెండు రాష్ట్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లేఖ రాశారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సైతం తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాసి ఆగస్టు 3న సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరారు. దీనికి ప్రతిస్పందనగా రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, తొలుత ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టాలని, ఆ తర్వాతనే సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయ కమిటీ మీటింగుకు తెలంగాణ హాజరుకావడం అనుమానమే.



Next Story