తెల్లకార్డులున్నవారందరికీ గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్

by  |
తెల్లకార్డులున్నవారందరికీ గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తెల్ల రేషను కార్డు ఉన్నవారందరికీ మనిషికి ఐదు కిలోల చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మే, జూన్ నెలలకు ఈ బియ్యాన్ని రేషను దుకాణాల ద్వారా తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెల్ల కార్డులు కలిగిన కుటుంబాలన్నీ ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నా ప్రతీ వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగానే అందజేయనున్నట్లు ఒక ప్రకటనలో సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో కరోనాపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ప్రకటన రూపంలో తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వం తలా ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు ఉచితంగానే తీసుకోవచ్చని, సుమారు 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రధాని ఇటీవల ప్రకటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలుచేయడంలేదంటూ ‘దిశ‘ ఆదివారం (మే 09, 2021) సంచికలో ‘వాళ్ళిస్తామంటే.. వీళ్ళొద్దన్నారు.. ‘ పేరుతో కథనాన్ని ప్రచురించింది. గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి మే, జూన్ నెలలకు ఉచితం అని నిర్ణయం తీసుకుని ప్రకటించడం గమనార్హం. అయితే కేంద్రం ఇస్తున్న బియ్యమే తప్ప రాష్ట్రం అదనంగా ఇస్తున్నదేమీ లేదనే విమర్శలు బీజేపీ వర్గాల నుంచి ఇప్పటికే వినిపిస్తున్నాయి. గతేడాది కరోనా సందర్భంగా కేంద్రం ఐదు కిలోలు ఉచితంగా ఇచ్చినా రాష్ట్రం మరో కిలో కలిపి ఇచ్చింది. కానీ ఈసారి అలా అదనంగా కలిపిందేమీ లేదు. అదనంగా తీసుకునే కిలో బియ్యానికి రూపాయి చెల్లించాల్సిందే.

ఇప్పటికే ఒక రూపాయికి కొనుక్కున్నవారి సంగతి…?

రాష్ట్రంలో రేషను దుకాణాల ద్వారా ప్రతీ వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఒక్కో కిలోకు రూపాయి చొప్పున రేషను దుకాణాల ద్వారా ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని అందజేస్తోంది. ప్రతీ నెలా మొదటి తారీకు నుంచి పది రోజుల్లోనే పంపిణీ పూర్తవుతుంది. ఇప్పటికే చాలా మంది కిలోకు రూపాయి చొప్పున చెల్లించి కొన్నారు. అయితే తాజాగా ఐదు కిలోలను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించినందున ఇప్పటికే కొనుక్కున్నవారికి ఆ డమ్బుల్ని తిరిగి చెల్లిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. వచ్చే నెలలో తీసుకునేదానికి జమ చేసుకుంటారా లేదా అనేదానిపై పౌర సరఫరాల శాఖ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రైవేటు టీచర్లకూ పాతిక కిలోలు

రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లకు, బోధనేతర సిబ్బందికి తలా రెండు వేల రూపాయల నగదు సాయం, పాతిక కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇవ్వనున్నట్లు సీఎం గతంలో ప్రకటించారు. ఆ ప్రకారం సుమారు రెండు లక్షల మందికి అందాల్సి ఉంది. కానీ ఏప్రిల్ నెలలో కేవలం 1.20 లక్షల మందికి మాత్రమే అందింది. దీన్ని కూడా సమీక్షించిన సీఎం కేసీఆర్, ఇప్పటిదాకా ఈ సాయానికి నోచుకోలేకపోయిన 80 వేల మంది ప్రైవేటు టీచర్లు, బోధనేతర సిబ్బందికి కూడా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed