'దళితబంధు' ఫెయిల్… వ్యూహం మార్చిన కేసీఆర్

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: “దళిత బంధుపై కేసీఆర్​ పునరాలోచనలో పడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం అనుకున్న స్థాయిలో అనుకూలంగా మారడం లేదు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధును ప్రవేశపెట్టినప్పటికీ.. అక్కడ ఈ వర్గాల్లో ఇంకా పట్టు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.” ఇదీ ప్రస్తుతం టీఆర్​ఎస్​ నేతల్లో జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వ్యూహాలపై కేసీఆర్​ కన్నేసినట్టు తెలుస్తున్నది. దళితబంధు అనుకూలతను తెచ్చిపెట్టకపోవడంతో ఫ్రస్టేషన్​కు గురవుతున్నట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. [&hellip;]</p>

dalitha bandhu telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో: “దళిత బంధుపై కేసీఆర్​ పునరాలోచనలో పడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం అనుకున్న స్థాయిలో అనుకూలంగా మారడం లేదు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధును ప్రవేశపెట్టినప్పటికీ.. అక్కడ ఈ వర్గాల్లో ఇంకా పట్టు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.” ఇదీ ప్రస్తుతం టీఆర్​ఎస్​ నేతల్లో జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వ్యూహాలపై కేసీఆర్​ కన్నేసినట్టు తెలుస్తున్నది. దళితబంధు అనుకూలతను తెచ్చిపెట్టకపోవడంతో ఫ్రస్టేషన్​కు గురవుతున్నట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రులపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. హుజురాబాద్​ పరిణామాలపై మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​తో పాటు పలువురు నేతలతో చర్చించిన సీఎం.. ప్రచారం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

ఎందుకు కలిసి రావడం లేదు

దళిత బంధు పథకం కేసీఆర్​కు కష్టాలు తెచ్చి పెడుతున్నది. ప్రతిపక్షాలకు ఇది గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పుతున్నా.. అధికార పార్టీలోనే వణుకు పుట్టిస్తున్నది. ఒక వర్గాన్ని గంపగుత్తగా తమకు అనుకూలంగా మల్చుకున్నట్లు చేసుకున్న సంబురాలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. అనుకున్న సమయానికన్నా ముందుగానే వాసాలమర్రిలో పథకం ప్రారంభించారు. ఈ నెల 16న పైలట్​ ప్రాజెక్టు హుజురాబాద్​లో 15 మంది లబ్ధిదారులకు సీఎం చెక్కులందించారు. మిగిలిన కుటుంబాలన్నింటికీ ఇస్తున్నట్టు ప్రకటించారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉన్నది. దళిత బంధు ప్రారంభమయ్యాక సీఎం కేసీఆర్​కు వ్యతిరేకమైన రిపోర్టులు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మంత్రులు, ఇతర నేతలతో ప్రగతిభవన్​లో సమావేశమైన సీఎం పథకంపై ఆరా తీశారు. దళిత వర్గాల్లో నమ్మకం కల్పించడం లేదని గుర్తించారు. ప్రతి కుటుంబానికీ రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నా ఎందుకు అనుకూలంగా మారటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మీరేం చేస్తున్నారు

దళిత బంధుపై ఫాయిదా లేకపోవడాన్ని అంచనా వేస్తున్న కేసీఆర్​ మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రగతిభవన్​లో చర్చిస్తున్న సమయంలోనే కేసీఆర్​ అక్కడున్న మంత్రులపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులు చెప్పిన వివరాలు, నిఘా వర్గాల నివేదికలకు పొంతన లేకపోవడం సీఎం ఆగ్రహానికి కారణమైందని చెబుతున్నారు. ఒక మంత్రిని ఏకంగా ఈటల రాజేందర్​కే సపోర్టు చేస్తున్నట్టు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఉలిక్కిపడ్డ సదరు మంత్రి హుజూరాబాద్​లో నెలకొన్న పరిణామాలను చాలా సేపు సీఎంకు వివరించినట్టు సమాచారం. అయినా మంత్రుల పనితీరుపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు పార్టీలో హాట్​ టాపిక్​గా మారింది.

ఏది ఏమైనా గెలువాల్సిందే

హుజూరాబాద్​ ఉప ఎన్నికలో గెలుపు ఇప్పుడు కేసీఆర్​ ప్రధాన లక్యం. ముందుగా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలువాలని, గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసిన టీఆర్​ఎస్​ వర్గాలు ..ఇప్పుడు కనీసం ఐదు ఓట్లతోనైనా గెలిస్తే చాలంటున్నారు. మంత్రులు గ్రామాల్లో తిరుగుతున్నా అంతగా కలిసి రావటం లేదు. ట్రబుల్​ షూటర్​కు కూడా ఎదురు ప్రశ్నలు, గ్రామాల్లో నిరసనల వెల్లువెత్తుతున్నాయి. ఇవే అంశాలను సీఎంకు వివరిస్తే.. మంత్రులపైనే మండిపడ్డారని, పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమయ్యారని మండిపడినట్టు తెలిసింది.

వ్యూహం మార్చిన కేసీఆర్​

దళితబంధు కలిసి రాకపోవడంతో గులాబీ బాస్​ వ్యూహం మార్చుతున్నట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది. త్వరలో హుజురాబాద్​ కోసం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఇందులో భాగంగా దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని కూడా ఇక్కడ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. వాస్తవంగా ప్రతిపక్షాల విమర్శలకు ఏమాత్రం విలువ ఇవ్వని సీఎం కేసీఆర్ దళిత బంధు అమలులో స్ట్రాటజీ మార్చారు.

బాధ్యత ఆ ముగ్గురు మంత్రులదే

హుజూరాబాద్​ ఉప ఎన్నిక మంత్రులకు చెమటలు పట్టిస్తున్నది. ప్రధానంగా ముగ్గురు మంత్రులకు చావోరేవో అన్నట్టుగా మారింది. మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​కు టార్గెట్​గా ఉంది. ముందుగా ఇలాంటి పరిణామాలను ఊహించే కేటీఆర్​ను పక్కనపెట్టినట్లు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్​ చీవాట్లు పెట్టడంతో మంత్రులు మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే ఈటల వ్యాఖ్యలపై ఎదురుదాడి చేసిన గంగుల కమలాకర్​ ఒక్కసారిగా సైలెంట్​ కావాల్సి వచ్చింది. అటు కొప్పుల ముందు నుంచీ మౌనంగానే ఉంటున్నారు. ఇటీవల హరీశ్​రావు పర్యటిస్తూ ఈటలకు కౌంటర్​ ఇస్తున్నారు. కానీ హరీశ్​రావు కౌంటర్​కు ఆశించినంతగా ప్రాధాన్యం లభించడం లేదు.

Next Story