కేబీసీలో నేరుగా హాట్‌ సీట్‌కు..

58

దిశ, వెబ్‌డెస్క్ :

కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొనే వారు ఆ కార్యక్రమం వరకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, హాట్ సీట్ వరకు చేరుకోవడం మరొక ఎత్తు. అవును.. ఎందుకంటే హాట్ సీట్‌కు వెళ్లే అవకాశం రావాలంటే ముందు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ నెగ్గాలి. అడిగిన ప్రశ్నకు వేగంగా వేళ్లు కదిలించగలిగి, సరైన సమాధానం చెప్పగలిగినవారే హాట్ సీట్‌కు వెళ్లే అవకాశాన్ని పొందుతారు. అయితే కేబీసీ చరిత్రలో మొదటిసారిగా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడకుండానే హాట్ సీట్‌కు వెళ్లి ఓ మహిళ రికార్డుకెక్కింది. గురువారం రోజున ముగ్గురు పార్టిసిపెంట్లతో అమితాబ్ గేమ్‌ను ప్రారంభించారు. ఆ మిగతా ఇద్దరు వెళ్లిపోవడంతో మిగిలిన ఒక్క పార్టిసిపెంట్‌ను ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ నిర్వహించకుండానే హాట్ సీట్ మీదకి ఆహ్వానించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ రికార్డుకెక్కిన మహిళ ఎవరంటే..

కోల్‌కతాకు చెందిన 43 ఏళ్ల రూనా శాహా. కేబీసీ మొదలైనప్పటి నుంచి ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా కాల్ రాకపోవడంతో ఇంట్లో వాళ్లు ఆమె మీద జోకులు కూడా వేశారట. అయితే ఈసారి కాల్ వచ్చి, ఇంటర్వ్యూ అయ్యే వరకు కూడా ఆమె ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఇక్కడి వరకు వచ్చి హాట్ సీట్ అవకాశం రాదేమోనని అనుకున్న ఆమెకు ఒక్కసారిగా హాట్ సీట్ మీద కూర్చోవాలని అమితాబ్ పిలవడంతో కంట నీరు ఆగలేదు. ఇక ఏడిచే రోజులు పోయాయంటూ అమితాబ్ ఆమెను ఓదార్చారు. చిన్నవయస్సులోనే పెళ్లి అవడంతో తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదని, అయినప్పటికీ చిన్న చీరల దుకాణం నడుపుతున్నట్లు, తాను ఏదో ఒకటి తప్పకుండా సాధిస్తాననే నమ్మకం ఉందని రూనా శాహా, అమితాబ్‌తో చెప్పింది. అన్నట్లుగానే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ లేకుండా హాట్ సీట్‌కు వెళ్లిన మొదటి వ్యక్తిగా రూనా రికార్డు సృష్టించారు. ఈ రికార్డులో ఆమె ప్రమేయం లేకపోవచ్చు, కానీ సంకల్పం గట్టిగా ఉంది.