ఓడి గెలిచారు.. మండలిలో కవిత vs జీవన్ రెడ్డి!

by  |
ఓడి గెలిచారు.. మండలిలో కవిత vs జీవన్ రెడ్డి!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : వారిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ఒకరి ఓటమి కోసం ఇంకొకరు శాయశక్తులా పని చేశారు. రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో అప్పుడు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. కానీ, ఇప్పుడు ఒకే సభకు వెళ్లనున్నారు. నాడు ఎంపీగా ఉన్న కవిత, ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డిలు ఇద్దరు కూడా ఇప్పుడు మండలికి ప్రాతినిథ్యం వహించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. రానున్న కాలంలో జగిత్యాల జిల్లాలో రాజకీయాలు రసంకందాయకంలో పడనున్నాయా అన్న చర్చ సాగుతోంది.

ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు..

2014 ఎమ్మెల్యే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేయగా.. జగిత్యాల నుంచి సంజయ్‌ కుమార్‌ను బరిలో నిలబెట్టారు. అప్పుడు జీవన్ రెడ్డి చేతిలో సంజయ్ ఓటమి పాలు కావడాన్ని సీరియస్ గా తీసుకున్న కవిత క్షేత్ర స్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసే పనిలో పడ్డారు. గ్రామగ్రామన పర్యటించాలన్న సంకల్పం పెట్టుకున్న కవిత ‘మన ఊరిలో మన ఎంపీ’ అనే కార్యక్రమం పేరిట జగిత్యాల సెగ్మెంట్‌ను చుట్టేశారు. జీవన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతూ కేడర్‌ను పెంచారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు జీవన్ రెడ్డిని టార్గెట్ చేసిన కవిత సంజయ్ గెలుపు కోసం ఊరువాడ కలియతిరిగారు. దీంతో అనూహ్యంగా జీవన్ రెడ్డి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఎంపీ ఎన్నికలప్పుడు..

2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవితను ఓడించేందుకు జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తన పర్సనల్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని నిజామాబాద్ జిల్లాలోని ఐదు సెగ్మెంట్లతో పాటు జగిత్యాల జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో సమీకరణలు చేశారు. పసుపు రైతుల ఆందోళనలు, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు పావులు కదపడంతో నిజామాబాద్‌లో కవిత ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కొంతకాలం స్తబ్ధంగా ఉన్న తరువాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు.

ఇద్దరూ మండలిలోకి..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపొందడంతో రాజకీయంగా వైరుధ్యంగా ఉన్న వీరిద్దరూ మండలిలోకి అడుగు పెట్టనున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ గత ఆరేళ్లుగా ఎదిగిన రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే సభకు ఎన్నిక కావడంతో మండలిలో వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ సాగుతుందోనని పలువురు మాట్లాడుకుంటున్నారు. మండలి సమావేశాల్లో కవిత వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్లుగానే ఉంటుందా అన్న విషయంపై అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ కేడర్ తర్జన భర్జన పడుతోంది. అయితే కవిత నిజామాబాద్ జిల్లా వరకే ఎమ్మెల్సీ కాగా జీవన్ రెడ్డి మాత్రం నాలుగు జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ కావడంతో స్థానికంగా జరిగే సమావేశాల్లో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్దం సాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్

మండలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవిత మండలికి ఎన్నిక కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అయితే ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని కవిత అనుచరుల్లో నూతనోత్తేజం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీగా కవిత గెలవడంతో తమకు పెద్దదిక్కుగా ఉంటారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed