సీఎం సభలో కౌశిక్ రెడ్డి హంగామా… గెల్లు సైలెంట్ వెనుక ఆంతర్యమేంటి?

by  |
సీఎం సభలో కౌశిక్ రెడ్డి హంగామా… గెల్లు సైలెంట్ వెనుక ఆంతర్యమేంటి?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన సభలో ఆ ఇద్దరి చుట్టే ప్రతి ఒక్కరూ దృష్టి సారించారు. ఇద్దరిలో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారన్న విషయంపై నజర్ వేసిన సామాన్యులు ఏంటి ఇలా జరుగుతోంది అన్న చర్చ మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ వద్ద తన ఇమేజ్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం ఒకరు చేస్తే.. మరోకరు దూరంగా ఉండడమేంటా? అన్నదే అంతు చిక్కకుండా తయారైంది.

రాష్ట్రం అంతా కూడా హుజురాబాద్ వైపే ఎదురు చూస్తున్న క్రమంలో ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం అంతు చిక్కకుండా పోయింది. ఎప్పుడు ఎలాంటి సమీకరణాలు మారుతాయోనని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. సీఎం సభలో సాధారణ నాయకునిలా మిగిలిపోవడమే అందరిలో మెదులుతున్న డౌట్. అయితే ఇదే సభలో పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి చేతులు కలపడం, సీఎం వెళ్తుండగా.. వెన్నంటి ఉండడాన్ని గమనించిన స్థానికులు కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశాడని, గెల్లు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరించడం వెనక కారణమేంటన్న డిస్కషన్ మొదలు పెట్టారు. నాయకత్వం కూడా గెల్లు ప్రమేయం ఉండే విధంగా చొరవ తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇన్ వాల్వ్ మెంట్ ను ఎక్కువగా చూపిస్తే.. సీఎం వద్ద ఆయనకున్న ఇమేజ్ ఏంటో గమనించిన ఓటర్లతో మరింత సానుకూలత పెరిగేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం సభలో శ్రీనివాస్ యాదవ్ కు తగ్గిన ప్రాధాన్యతతో టీఆర్‌ఎస్ పార్టీలో ఏం జరుగుతోందనన్న చర్చే సాగుతోంది.

అఫీషియల్ ప్రోగ్రాం…

అయితే శాలపల్లి వద్ద జరిగిన కార్యక్రమం అఫీషియల్ కావడం వల్లే గెల్లు గురించి సీఎం మాట్లాడలేదన్న వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ.. పార్టీ బాధ్యులు కూడా డయాస్ పై చొరవ తీసుకున్నారు. దీంతో పాటు ఎలాంటి బాధ్యతలు లేని కౌశిక్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేశారు కదా.. గెల్లు ఆ చొరవ ఎందుకు తీసుకోలేకపోయారో అర్థం కావడం లేదని స్థానికులు మట్లాడుకుంటున్నారు. పార్టీ నాయకత్వం కావాలనే శ్రీనివాస్ ను హోల్డ్ లో పెట్టిందా? లేక ఆయన సీఎం ముందు అత్యుత్సాహం ప్రదర్శించడం ఎందుకు అనుకున్నారో తెలియదు కాని సీఎం మీటింగ్ వ్యవహారం కాస్తాఅభ్యర్థిని మారుస్తారా అన్న చర్చకు దారి తీసింది. ఇతర పార్టీ బాధ్యులు కూడా ఈ సభా వేదికపై కనిపించడం గమనార్హం.

ఎమ్మెల్సీకి బ్రేక్…

అయితే గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ కు కూడా ప్రతిపాదనలు పంపించారు. కానీ అనూహ్యంగా ఆయనపై ఉన్న నేర చరిత్ర తెరపైకి రావడంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రకటన అధికారికంగా వాయిదా పడింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో కౌశిక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారా? అన్న అనుమానాలు కూడా ప్రారంభం అయ్యాయి. సీఎం మీటింగ్ లో కూడా కౌశిక్ హల్ చల్ చేయడంతో ఇక్కడి ప్రజల్లో ఈ అనుమానం మరింత పెరిగింది.

నమస్కారంతో సరి…

సభా వేదికపై సీఎం కేసీఆర్ పలువురి వద్ద ఆగి మాట్లాడారు. గెల్లు వద్దకు వచ్చిన తర్వాత నమస్కారంతో సరి పెట్టారు. ఒకరిద్దరు సీఎం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు దండలు వేశారు. కానీ గెల్లు మాత్రం డయాస్ వెనక రోల్‌లోనే ఉండిపోయారు. అభ్యర్థి డిఫెన్స్ లో పడిపోయారా? లేక ప్రాధాన్యత కల్పించలేదా? అన్న చర్చ జరుగుతోంది.

ఫ్లెక్సీల్లోనూ..

నియోజకవర్గం అంతటా సీఎం కేసీఆర్ కు స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ప్లెక్సీ ల్లోనూ సీఎం కేసీఆర్, గెల్లు, కౌశిక్ రెడ్డిల ఫోటోలు కనిపించాయి. దీంతో టీఆర్‌ఎస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? అన్న విషయంపై తర్జన భర్జన సాగుతోంది. గెల్లు అభ్యర్థిత్వం గురించి కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్న ప్రచారానికి తగ్గట్టుగానే.. సీఎం సభలో ఆయనకు ప్రాధాన్యత తగ్గినట్టు కనిపించడం విశేషం. అయితే గెల్లు అభ్యర్థిత్వంపై ఇతర వర్గాల్లో ఉన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు అధిష్టానమే అలా వ్యవహరించి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ఏది ఏమైనా సీఎం పర్యటన అభ్యర్థి విషయంలో సరి కొత్త చర్చకు దారి తీసిందని చెప్పకతప్పదు.

సీఎం కేసీఆర్‌కు భారీ షాకిచ్చిన నేషనల్ మీడియా సర్వే సర్వేలో బయటపడ్డ సంచలన విషయాలు

కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణాలివే..


Next Story

Most Viewed