వరల్డ్ కిక్ బాక్సింగ్ విజేతగా కశ్మీర్ అమ్మాయి

by  |
tajamul
X

దిశ, స్పోర్ట్స్: కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల తజాముల్ ఇస్లామ్ వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ – 14 చాంపియన్‌గా నిలిచింది. ఇటీవల ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన ఛాంపియన్‌షిప్‌లో తజాముల్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఫైనల్‌లో అర్జెంటీనాకు చెందిన లాలీనాతో తలపడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కశ్మీర్‌లోని బందిపొర జిల్లా తర్కాపోర గ్రామానికి చెందిన తజాముల్ ప్రస్తుతం ఆర్మీ గుడ్‌విల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నది.

2016లో కూడా అండర్-9 కేటగిరీలో తజాముల్ వరల్డ్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నది. కానీ పెద్దగా రాణించలేక పోయింది. అయితే ఈ సారి ఇండియా నుంచి 30 మంది క్రీడాకారులు పలు కేటగిరీల్లో పాల్గొనగా తజాముల్ మాత్రమే విజేతగా నిలిచింది. తొలి రెండు బౌట్లు ఆతిథ్య ఈజిప్టు బాక్సర్లతో తలపడిన తజాముల్.. ఆ తర్వాత వరుసగా ఫ్రాన్స్, అర్జెంటీనా ఆటగాళ్లతో తలపడి విజేతగా నిలిచింది.

‘నేను భవిష్యత్‌లో ఆర్దోపెడిక్ డాక్టర్ కావాలనుకుంటున్నా. ఎముకలు విరగ్గొట్టటమే కాదు.. అతికించడంలో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను’ అని తజాముల్ వ్యాఖ్యానించింది. కాగా, తజాముల్ ‘బేటీ బచావ్ బేటీ పడావ్’ స్కీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావడం గమనార్హం.


Next Story