రేవంత్ రెడ్డి పిటిషన్‌పై 11న తీర్పు

by  |
రేవంత్ రెడ్డి పిటిషన్‌పై 11న తీర్పు
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. ఏసీబీ నుంచి రేవంత్ రెడ్డి తరుపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ప్రకటించేందుకు ఈ నెల 11కు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు విచారణ ఎన్నికల కమిషన్ విచారణ పరిధిలోకి వస్తోందంటూ.. ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. మంగళవారం రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత జడ్జి 11వ తేదీకి తీర్పును వాయిదా వేశారు. ఈ సందర్బంగా కోర్టుకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహలు హజరయ్యారు. అగ్రిగోల్డ్ కేసులో జ్యూడిషియల్ రిమాండ్ పూర్తి కావడంతో నిందితులను ఈడీ అధికారులు మంగళవారం కోర్టులో హజరుపర్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేషు నారాయణ, హేమ సుందర వర ప్రసాద్‌లకు ఈడీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని ఈడీ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈడబ్ల్యూఎస్ రిజనర్వేషన్లు అమలుపై విచారణ

రాష్ట్రంలో అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ దాఖలయిన పిల్‌ను హైకోర్టు విచారించేందుకు స్వీకరించింది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారించేందుకు మంగళవారం హైకోర్టు స్వీకరించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాజ్యాంగ సవరణ జరిగిందన్న విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో వైద్య విద్య కోర్సులతో పాటు ఇతర విద్య, ఉద్యోగాలలో అగ్రవర్ణాలలోని పేదలు అవకాశాలను కోల్పోతున్నట్టు తెలిపారు. దీంతో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆలె భాస్కర్ తరుపున తాళ్లపల్లి రాజశేఖర్ వాదనలు విన్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున జీపీ నాగేశ్వరరావు వాదనలు విన్పించారు.


Next Story

Most Viewed