పులకరించిన కరీంనగర్.. బైడెన్ టీమ్ లో వినయ్ రెడ్డి

1088

దిశ, హుజురాబాద్: కరీంనగర్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ కు వైట్ హౌజ్ స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా కరీంనగర్ కు చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడం చర్చాంశనీయంగా మారింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి 1970లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లి ఆక్కడే స్థిర పడ్డారు. నారాయణరెడ్డి ముగ్గురు కొడుకుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలో లా కంప్లీట్ చేసిన వినయ్ రెడ్డి మొదట యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కు స్పీచ్ రైటర్‌గా పని చేశారు.2012 రీ ఎలక్షన్ టైంలో ఒబామాకు, బైడెన్లకు స్పీచ్ రైటర్ గా వ్యవహరించారు.
తాజా ఎన్నికల్లో బైడైన్, కమలా హారిస్ లకు స్పీచ్ రైటర్ తో పాటు ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు వైట్ హౌజ్ డైరెక్టర్ గా అపాయింట్మెంట్ అయ్యారు. తమిళనాడు సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా ఆమెతో పాటు, ప్రెసిడెంట్ జో బైడెన్ లకు స్పీచ్ రైటర్ కం ట్రాన్స్‌లేటర్ గా వ్యవహరించి కీలక పాత్ర పోషిస్తున్న వినయ్ రెడ్డి  తెలంగాణ సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం.

గ్రామంతో అనుభందం

1970లో అమెరికాకు వెళ్ళిన నారాయణరెడ్డి మాత్రం స్వగ్రామమైన పోతిరెడ్డిపేటలో ఆస్థులను మాత్రం విక్రయించలేదు. 3 ఎకరాల వ్యవసాయ భూమిని, ఇళ్లు ఆయన పేరిటే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా నారాయణరెడ్డి గ్రామానికి వచ్చి, ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటుంటారు. పోతిరెడ్డిపేటలో చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించి సేవాగుణాన్ని చాటుకున్నారు.

ఆనందంగా ఉంది

పోతిరెడ్డిపేటకు చెందిన నారాయణరెడ్డి కొడుకు వినయ్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్పీచ్ రైటర్ గా వ్యవహరిస్తుండడం ఆనందంగా ఉంది. మా గ్రామంలో పుట్టి పెరిగిన నారాయణరెడ్డి కుమారుడు కావడంతో సంబరపడుతున్నాం. వినయ్ రెడ్డి వల్ల గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందంని అంటున్నారు గ్రామస్తులు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..