జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్!

by  |
Reliance Jio
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ప్రత్యేకమైన రెండు పథకాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో రీఛార్జ్ చేసుకోలేని జియో వినియోగదారులకు నెలకు 300 నిమిషాల ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్(రోజుకు 10 నిమిషాలు) రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కల్పించనున్నారు. అలాగే, జియోఫోన్ వినియోగదారులు రీఛార్జ్ చేసుకునే ప్రతీ ప్లాన్‌కు అంతే విలువైన రీఛార్జ్ ప్లాన్‌ను ఉచితంగా అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఉదాహరణకు జియోఫోన్ వాడుతున్న వ్యక్తి రూ. 75 తో రీఛార్జ్ చేయిస్తే, దీనికి అదనంగా రూ. 75 ప్లాన్ పూర్తి ఉచితంగా పొందవచ్చు.

ఈ రెండు పథకాలకు సంబంధించి రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనున్నట్టు జియో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ప్రతి భారతీయుడికి డిజిటల్ లైఫ్ అందించాలనే లక్ష్యంతో జియోఫోన్ ప్రారంభమైందని, ప్రస్తుత సంక్షోభం సమయంలో వారికి సరసమైన ధరలో నిరంతరం సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కంపెనీ వెల్లడించింది. కరోనా పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకోలేని జియోఫోన్ కస్టమర్లకు ఈ రెండు పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కంపెనీ అభిప్రాయపడింది.


Next Story