టీపీసీసీ చీఫ్‌గా‌ జీవన్ రెడ్డి.. రేవంత్‌కు కీలక పదవి..?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-01-04 13:18:41  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కొత్త కూర్పుపై నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డిని ఖరారు చేసింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబును, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించాలని నిర్ణయించింది. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరికొన్ని గంటల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుమీద అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం [&hellip;]</p>

టీపీసీసీ చీఫ్‌గా‌ జీవన్ రెడ్డి.. రేవంత్‌కు కీలక పదవి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కొత్త కూర్పుపై నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డిని ఖరారు చేసింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబును, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించాలని నిర్ణయించింది. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరికొన్ని గంటల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుమీద అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇంతకాలం పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఖరారు చేయవచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. రేసులో తానూ ఉన్నానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ప్రకటించుకున్నారు. వీరిద్దరిలో ఎవరికి పీసీసీ పీఠం దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. కానీ చివరకు జీవన్‌రెడ్డి పేరును ఎంపిక చేయడంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా వ్యవహరించిందన్న అభిప్రాయం ఆ పార్టీ రాష్ట్ర నేతల్లో వ్యక్తమైంది. రేవంత్‌రెడ్డి పేరు తెరమీదకు రావడంతోనే పార్టీలో గ్రూపులవారీగా నాయకులు విడిపోయారు. ఆయనకు అనుకూల, ప్రతికూల వర్గాలు ఏర్పడ్డాయి.

రోజురోజుకూ నిర్వీర్యమైపోతున్న పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో కొత్త నేత ఎంపిక ఏఐసీసీకి సవాలుగా మారింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మాణిక్కం ఠాగూర్ నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి సీనియర్ల, జిల్లా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో చర్చించారు. ఏఐసీసీ నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న సోనియాగాంధీ వ్యక్తిగతంగా పీసీసీ రేసులో ఉన్నవారందరితో మాట్లాడినట్లు ఏఐసీసీ నేతలే చెప్పారు. చివరకు అన్ని వర్గాల నేతలకూ సమానదూరంలో, ఆమోదయోగ్యుడిగా ఉండే జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది.

పీసీసీ చీఫ్ పదవి రాకపోయినా తనకు నష్టం, అసంతృప్తి లేదని, సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేయడానికి పని చేస్తానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా రాష్ట్రమంతా తిరిగి 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అధిష్ఠానం అప్పజెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంపై ఒక దశలో ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తనంతట తానుగా జీవన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానానికి ప్రతిపాదించారు. చివరకు అదే ఖరారైంది. కొత్త పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి తక్షణం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలు, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం తదితర ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసే బాధ్యత ఏర్పడింది.

Next Story