అత్యవసర సేవల్లో జలమండలి అట్టర్ ఫ్లాఫ్..!

by  |
అత్యవసర సేవల్లో జలమండలి అట్టర్ ఫ్లాఫ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో :

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన బస్తీలకు, కాలనీలకు తాగునీరు అందించడంలో జలమండలి విఫలమైంది. వర్షాలు తగ్గి మూడు రోజులు గడుస్తున్నా క్లోరిన్ మాత్రలు, బ్లీచింగ్ పౌడర్‌ను సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ట్యాంకర్లంటూ, క్యాన్ లంటూ, వాటర్ పాకెట్లంటూ ప్రకటనలు గుప్పిస్తున్న అధికారులు వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం లేదు. అందుకు నిదర్శనం 155313 ఫోన్ నెంబర్ నుంచి వస్తున్న సమాధానాలే. ఒక్కమాటలో చెప్పాలంటే మురుగునీటిని తొలగించడంలో, మ్యాన్ హోల్స్ శుభ్రపరచడంలో ఇంకా పూర్తిస్థాయి పనులు చేపట్టలేదు. బస్తీలకు, మురికివాడలకు తాగునీటిని సరఫరాకు తగిన ఏర్పాట్లు లేవు.

వివరాలు సరే… ప్రాంతాలేవి…?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్యాంకర్ల ద్వారా, క్యాన్ లు, ప్యాకెట్ల ద్వారా నీటిని పంచుతున్నామని వెల్లడిస్తున్న అధికారులు ఏ ఏ ప్రాంతాల్లో పంచుతున్నారనేది స్పష్టం చేయకపోవడంతో అవి కాగితాల్లోని లెక్కలేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో అధికారికంగా 1475 మురికివాడలున్నాయి. గుర్తించనివి మరో 100 వరకు ఉంటాయి. దాదాపు 400 ప్రాంతాలు ముంపునకు గురైనట్టు అధికారులే వెల్లడిస్తున్నారు. రోజుల తరబడి ఇండ్లకు, అపార్ట్​మెంట్లకే పరిమితమైన ప్రజలకు తాగునీరును అందించడంలో జలమండలి ప్రకటనలకే పరిమితమైందనే ఆరోపణలున్నాయి.

పలువురు బస్తీవాసులు నాలుగు రోజులకు ఇప్పుడు నీటిని వదిలారని, ప్రజాప్రతినిధులు వస్తున్నారనే నీటిని సరఫరా చేశారని నిలదీసిన విషయం విదితమే. దీనికి తోడు ఒక్క రోజే ట్యాంకర్ల ద్వారా 534 ట్రిప్పులు, 26,70,000 లీటర్ల నీటిని సరఫరా చేశామని, మంచి నీటి క్యాన్లు 1700, నీటి బాటిల్స్ – 2500 , ప్యాకెట్లు – 25,000, క్లోరిన్ టాబ్లెట్స్ – 2,50,000, బ్లీచింగ్ పౌడర్ -3108 కిలోలు పంచినట్టు లెక్కలు చెప్పుతున్న అధికారులు ఏఏ ప్రాంతాల్లో పంచారనేది మాత్రం వెల్లడించడం లేదు. అన్నీ జనరలైజ్ చేసి వెల్లడించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే టైం పడుతుందని సమాధానమొస్తున్నది.

అత్యవసర సేవలెక్కడ..?

శనివారం మళ్లీ వాన పడింది. పలు ప్రాంతాలు తిరిగి ముంపునకు గురవుతున్నాయి. నగరం, శివారు ప్రాంతాలకు బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు రానేలేదు. నేటికీ చాలా బస్తీల్లో అత్యవసరంగా అందించాల్సిన తాగునీరు కోసం ఎదురు చూడాల్సి వస్తుందని మురికివాడల వాసులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని బస్తీలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అధికారులు మాత్రం ప్రకటనలు చేస్తూ రోజుకు ఇంతమేర సేవలందించామని వెల్లడిస్తున్నారు. అదే ప్రజల నుంచి అవి అందాయనే సమాధానాలు రావడంలేదు. దీంతో అధికారులు ప్రణాళికాబద్ధంగా సేవలను అందించడంలేదనేది స్పష్టమవుతోందని బస్తీవాసులు విమర్శిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అత్యవసర సేవా పనులు రోజుల తరబడి జాప్యంతో జలమండలి తీరు ఎలా ఉందో తెలియజెప్పుతోంది.



Next Story