సంక్షేమం ఆగదు.. అభివృద్ధి సాగదు: వినోద్ ఇంటర్వ్యూ

by  |
సంక్షేమం ఆగదు.. అభివృద్ధి సాగదు: వినోద్ ఇంటర్వ్యూ
X

దిశ, న్యూస్ బ్యూరో: ‘‘కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చాలా సమయం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తొందరలోనే కోలుకుంటుంది. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. కానీ మన రాష్ట్రం రూ.20వేల కోట్లతో మార్చి చివరి వారంలోనే ప్యాకేజీ ప్రకటించింది. సంక్షేమ పథకాలను నిలిపేసే ప్రసక్తే లేదు. కానీ కొత్తగా అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండదు. ఇప్పటి వరకు రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉంది. మళ్లీ ఆ స్థాయికి చేరుకోవాలంటే రెండేళ్లు పడుతుంది. ఆరోగ్య రంగాన్ని కేంద్రం పట్టించుకోలేదు. అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ‘దిశ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.’’ మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

కరోనాతో తెలంగాణకు జరిగిన నష్టమెంత?

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు గానే.. మన రాష్ట్రానికి కూడా కరోనాతో నష్టం జరిగింది. అయితే మన దగ్గర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో కోలుకోడానికి ఎక్కువ సమయం పట్టదు. మనం చేస్తున్న ప్రయాణంలో ఇది ఒక తాత్కాలిక బ్రేక్ మాత్రమే. ఒక ‘పాజ్’ బటన్ లాంటిది. మళ్లీ గాడిలో పడతాం. పెట్టుబడిదారుడికి జరిగిన నష్టం ఒక రకంగా ఉంటే, పుట్‌పాత్ మీద పానీపూరి వ్యాపారం చేసుకునేవారికి మరో స్థాయిలో నష్టం జరిగింది.

కోలుకోడానికి ఎంత సమయం పట్టొచ్చు?

రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు.. ఇలా అన్నీ దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ జీరోతో మొదలుపెట్టాల్సి వచ్చింది. అణుబాంబుతో ప్రకృతి వనరులు కూడా ధ్వంసమయ్యాయి. యూరప్‌లో చాలా ఏండ్లు గడ్డి కూడా మొలవలేదు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం అలాంటిది కాదు. కేవలం మానవజాతికే ఇబ్బంది కలిగింది. పక్షులు, జంతువులు, ప్రకృతికి నష్టం జరగలేదు. మౌలిక సౌకర్యాలు పటిష్టంగా ఉన్నాయి. పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తే తొందర్లోనే బైటపడతాం. వైజాగ్ గ్యాస్ లీక్ లాంటి సంఘటన అన్నింటినీ తాకింది. కానీ కరోనా అలా లేదు.

రాష్ట్రం వద్ద ఉన్న వ్యూహమేంటి?

మనది గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. అందుకే కరోనా లాక్‌డౌన్ వచ్చిన రోజు నుంచే ముందుచూపుతో ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టాం. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల తర్వాత నాలుగు రోజుల క్రితం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. కానీ మనం మార్చి చివరి వారంలోనే రూ. 20 వేల కోట్లతో గ్రామీణ ప్రజలకు ప్యాకేజీ ప్రకటించాం. రైతుల నుంచి పంటలను కొన్నాం. ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు ఇచ్చాం. ఇతర ఖర్చులకు ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున సాయం చేశాం. కరోనా అనేది వారి ఊహకు కూడా అందకుండా చేశాం. లేకుంటే రైతుల్లో నిరాశా నిస్పృహలు వచ్చేవి. గ్రామాల్లో అశాంతి నెలకొనేది. పరిస్థితి అల్లకల్లోలం అయ్యేది. మన ముందుచూపుతో అవి లేకుండా పోయాయి. సంక్షోభం నుంచే మనం అవకాశాలను వెతుక్కునే పటిష్ట వ్యూహాన్ని రూపొందించాం. నెలన్నర క్రితమే మనం రికవరీ మూడ్‌లోకి వచ్చేశాం.

పట్టణాల ఎకానమీ సంగతేంటి?

గ్రామాల్లో రైతులకు పంటలమ్ముకున్న డబ్బులు చేతికొచ్చాయి. వాటిని నిత్యావసరాలకు, ఎరువులకు, విత్తనాలకు, పురుగుమందులకు, వ్యవసాయ అవసరాలకు ఖర్చు చేస్తారు. చివరికి అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దగ్గరికే చేరుతుంది. ఆ దుకాణాల డిమాండ్లకు తగ్గట్టుగా పట్టణాల్లోని హోల్‌సేల్ దుకాణాల వ్యాపారం పెరుగుతుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలినచోట్ల ఆర్థిక లావాదేవీలు గాడిలో పడ్డాయి. మరికొన్ని ఆంక్షలు సడలించితే ఆర్థికంగా ఇంకొంత బెటర్ అవుతాం. టెన్షన్ పడాల్సిందేమీ లేదు.

సంక్షేమ పథకాలపై ప్రభావమెంత?

కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని అన్ని రాష్ట్రాలు ఎంత బాధ పడుతున్నాయో తెలీదు.. కానీ మనం మాత్రం పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదు. కాకుంటే కొన్ని రోజులు అటూ ఇటు కావచ్చు. రాష్ట్రంలో సుమారు 60% మంది ప్రజలకు ప్రభుత్వ సహకారం అందింది. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడం చాలా అవసరం. దాన్ని ప్రభుత్వం గుర్తించింది కాబట్టి.. సంక్షేమంలో కోతలు ఉండవు.

ఆదాయం సర్దుబాటు ఎలా?

ఐదేళ్లుగా మనం దృష్టి పెట్టిన మౌలిక సదుపాయాలతో మన ఎకానమీ కాస్త అదుపులో ఉంది. రుణాలు ఇవ్వడానికి చాలా బ్యాంకులు, ద్రవ్య సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ మన వాటాగా 20% భరించాల్సి ఉంది. ఇది కూడా ఇప్పుడు కష్టంగా మారింది. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారితే రుణాలకు కొదువ ఉండదు. మనం మొదటి నుంచీ స్వీయ ఆర్థిక వనరులపైనే ఫోకస్ పెట్టాం. కేంద్రం నుంచి వచ్చేది దానికి అదనం మాత్రమే. దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది. కొత్తగా రోడ్లు, భవనాల నిర్మాణం, మౌలిక సౌకర్యాలు లాంటి అభివృద్ధి పనులు ఉండవు. బడ్జెట్ ప్లాన్‌లో ఉన్న ప్రాజెక్టులు మాత్రం యథావిధిగా అమలవుతాయి. తొందరలోనే సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన రూ. 20 వేల కోట్ల టెండర్లను పిలుస్తాం. దీంతో మరికొంత ఎకానమీ యాక్టివిటీస్ జరుగుతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకే మళ్లీ చేరుతుంది.

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఎలా ఉంది?

కేంద్రం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో వ్యాపారవేత్తలు, సర్వీస్ సెక్టార్‌లకు కొన్ని మంచివే ఉన్నాయి. కానీ రీఫైనాన్స్ స్కీం, కాంపా స్కీమ్ లు అవసరం లేదు. బ్యాంకులు ఇప్పటికే ఎన్‌పీఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కొత్తగా రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు. కేంద్రం చెప్పడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆచరణలో అది అమలయ్యేది కాదు. గత రెండేళ్లుగా కొత్త రుణాలను ఇవ్వడం ఆపేశాయి. ఇప్పుడు కేంద్రం చెప్పినంత మాత్రాన ఇస్తుందన్న నమ్మకం లేదు. రుణానికి వెళ్లినప్పుడు బ్యాంకులు ఇవ్వకపోతే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో మెకానిజం లేదు. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి.

రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు ఎలా ఉన్నాయి?

కరోనా లాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునేది కేంద్రమే. రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయినా సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్రాలు పెద్దగా ఫీల్ కాలేదు. కానీ నిర్ణయాల అమలు బాధ్యత రాష్ట్రాలదే కాబట్టి ఆచరణ సాధ్యమయ్యే తీరులో రాష్ట్రాలతో కేంద్రం సంప్రదిస్తే బాగుండేది. రాష్ట్రాల అవసరాలను కూడా కేంద్రం పట్టించుకోలేదు. కొత్త రుణాలు తీసుకోవడంలో పరిమితుల సడలింపు, పాత రుణాల చెల్లింపుల్లో రాష్ట్ర అభిప్రాయాలు కేంద్రం పట్టించుకోలేదు. ప్రజారోగ్య వ్యవస్థకు ఉద్దీపన ప్యాకేజీలో కొంత సాయం అందాల్సి ఉంది. కానీ ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోలేదు. ఈ రంగాన్ని విస్మరించింది.

వలస కార్మికుల సమస్యను అధిగమించేదెలా?

ప్రతీ రాష్ట్రానికి ఉన్నట్లుగానే మనకూ వలస కార్మికుల సమస్య ఉంది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వలస కార్మికులు ఇప్పుడు గ్రామ స్థాయి వరకు విస్తరించారు. పత్తి, మిర్చి ఏరే వారిలో కూడా వలస కార్మికులు ఉన్నారు. మండల కేంద్రాల్లో మనకు చాలాచోట్ల పానీపూరీ, రాజస్థాన్ స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ లాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ వలస కార్మికులు పెట్టుకున్నవే. భవన నిర్మాణ పనులతో మొదలై ఇప్పుడు ఫ్యాక్టరీల్లో కార్మికులుగా, టెక్నీషియన్లుగా, స్వయం ఉపాధికల్పనగా, పంట కోతల సమయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల మెకానిక్‌లుగా.. రకరకాల పనుల్లో మనకు కనిపిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది ఉండొచ్చు. ఇందులో చాలా మంది లాక్‌డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఆ కారణంగా చాలా పనులు ఆగిపోయాయి. కానీ రెండు మూడు నెలల్లోనే తిరిగి వస్తారు. ఇప్పటికే వందలాది మంది వచ్చారు. మళ్లీ జూలై నుంచి వారి రివర్స్ వలసలు పెరుగుతాయి. రాష్ట్రంలో యథావిధిగా పనులు ఊపందుకుంటాయి.

కార్మిక చట్టాల్లో సవరణలు తప్పవా?

తెలంగాణ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సవరణలకు, సంస్కరణలకు సుముఖంగా లేదు. చట్టాన్ని సవరించవద్దని సీఎం స్పష్టమైన నిర్ణయమే తీసుకున్నారు. అందువల్ల కార్మికులు ఆందోళన పడాల్సిన పనిలేదు. దేశంలో నిరుద్యోగం తీవ్రంగానే ఉంది. చదువుకు తగ్గ ఉపాధి దొరకడం లేదు. చాలా మంది గ్రాడ్యుయేట్లకు ఉపాధి కరువవుతోంది. మన రాష్ట్రం పరిస్థితే చూస్తే లక్షలాది మంది యువతీ యువకులు ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టెక్నీషియన్లపై ఆధారపడుతున్నాం. రెండు నెలలుగా పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం మరింత పెరుగుతుంది. అందుకే చాలా రాష్ట్రాల్లో కార్మిక చట్టాల్లో సవరణలు జరుగుతున్నాయి. పని గంటలూ పెరుగుతున్నాయి.

రైతుబంధుకు కోతలుంటాయా?

ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకుంటే రైతుబంధు సాయం అందదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది రాష్ట్రంలో మన అవసరాలు, పంటల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని రైతుల్ని అప్రమత్తం చేయడం, చైతన్య పరచడంలో భాగమే. అంతేకానీ రైతుబంధుకు కోత పెట్టాలనే ఉద్దేశం కాదు. యథావిధిగా రైతుబంధు సాయం అర్హులైన వారికి అందుతుంది. ఇప్పటికే ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసింది. పంట వేయకముందే పెట్టుబడి సాయంగా వారికి అందుతుంది. సమగ్ర పంటల నియంత్రిత విధానం కోసమే ప్రభుత్వం రైతుబంధును ప్రస్తావించింది.

లోటు బడ్జెట్ తప్పదా?

ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఖాయంగానీ దాని తీవ్రత ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం. అన్ని దేశాలు, రాష్ట్రాలకు ఉన్నట్లుగానే మనకూ ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఇంతకాలం మనం మిగులు బడ్జెట్‌తో ఉన్నాం. ఇప్పుడు రెండు నెలల కరోనా ఎఫెక్ట్‌తో లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. దేశ జీడీపీ ఎలా ప్రభావితమైందో మన జీఎస్‌డీపీ కూడా అంతే ఉంటుంది. గ్లోబల్ ఎకానమీలో తెలంగాణ భాగమే తప్ప విడిగా లేదు. ప్రపంచం నుంచి తెలంగాణ విడిగా బతకడంలేదు. ఎంత లోటు ఉంటుంది, ఇప్పటికే రెండు నెలల లోటును ఎలా భర్తీ చేసుకుంటాం అనేది మనం వేసుకునే ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటిలాగా మిగులు బడ్జెట్ మాత్రం ఉండదు.

మన రాష్ట్రం నుంచి వ్యాక్సిన్ వస్తుందా?

ఐదారు నెలల్లోనే మన రాష్ట్రం నుంచి కరోనాకు వ్యాక్సిన్ రాబోతుంది. మామూలుగానైతే ఒకటిన్నర సంవత్సరం కనీసంగా పడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించడంతో తొందరగా వచ్చే అవకాశం ఉంది. అది తెలంగాణ నుంచే ప్రపంచానికి అందుతుంది. ఆ తర్వాత సమాజంలో కొంత మార్పు వస్తుంది. మొత్తం ప్రపంచమే కరోనాతో కలిసి బతకాల్సిందేనని అంటోంది. మన సీఎం కూడా అంటున్నారు. జూలై నెలలో మళ్లీ తీవ్రం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అప్పుడు అందరూ ఇండ్లల్లో ఉండక తప్పదు.


Next Story

Most Viewed