పేదలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే : బీవీ రాఘవులు

by  |
BV Raghavulu
X

దిశ, నేరేడుచర్ల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేక నానా తంటాలు పడుతూ రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని సీపీఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ‘ప్రస్తుత ప్రభుత్వాలు- ప్రజా వ్యతిరేక చట్టాలపై నిర్వహించిన సెమినార్‌లో రాఘవులు మాట్లాడారు.

నేడు వివిధ పార్టీల పాలకులు అనుభవిస్తోన్న రాజ్యాధికారాల కమ్యూనిస్టు ఉద్యమకారులు పెట్టిన భిక్షేనని అన్నారు. పేదలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని, యావత్తు దేశమంతా ప్రజలు మళ్లీ కమ్యూనిస్టుల వైపు చూసే పరిస్థితిని నేటి పాలకులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని, బలహీనమయ్యారని అంటున్న నేటి పాలకులు.. ప్రజల పక్షాన నిగ్గదీసి ప్రశ్నించేది కమ్యూనిస్టులేనన్న విషయాన్ని గుర్తుంచ్చుకోవాలన్నారు.పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలకు చేసే దానికి సంబంధం లేకుండా పోయిందని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించే సంస్కృతిని పెంచి పోషిస్తుందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల బిల్లులపై రైతులను ముందుండి నడిపించింది కమ్యూనిస్టులే అన్నారు. ఏడాది పాటు నడిపిన ఉద్యమంతో మోదీ సర్కార్ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి చుట్టాలను విరమించుకున్నారని గుర్తు చేశారు. దేశంలో కార్పొరేట్ వ్యవస్థకు రాచబాట వేస్తూ అంబానీ, అదానీల వ్యాపారాలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎలా తొలగించాలనే దానిపై కుట్రలు జరుగుతున్నాయని రాఘవులు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ధీరావత్ రవినాయక్, యాదగిరి రావు, బుర్రి రాములు, నెమ్మది వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఎస్కే యాకూబ్, అనంత ప్రకాష్, పాండు, సైదులు, నగేష్, తుమ్మల సైదయ్య, వెంకటేశ్వర్లు, శీను, వెంకయ్య, నారాయణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed