వివాదంలో ‘సారంగదరియా’.. లైవ్‌లో కన్నీరుపెట్టిన సింగర్

by  |
వివాదంలో ‘సారంగదరియా’.. లైవ్‌లో కన్నీరుపెట్టిన సింగర్
X

దిశ, సినిమా : ఇటీవల కాలంలో సినిమా కథల విషయంలో పలు వివాదాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ ‘అరవింద సమేత’ చిత్రాల కథ విషయంలో తమకు క్రెడిట్ ఇవ్వలేదనే వాదనలు వినిపించాయి. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ మూవీపైన కూడా ఇలాంటి ఓ అపవాదు ఉంది. తాజాగా ‘లవ్‌స్టోరి’ నుంచి విడుదలైన సూపర్ డూపర్ హిట్ ‘సారంగదరియా’ పాట విషయంలోనూ వివాదం రాజుకుంది. ఈ పాటకు జానపదం మూలమన్న సంగతి విదితమే కాగా వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన కోమలి అనే అమ్మాయి ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఫీల్ గుడ్ మూవీస్ అందించే శేఖర్ కమ్ముల, పాటల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఆయన చిత్రాల్లో మ్యూజిక్ ది బెస్ట్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చిత్రాల్లోని పాటలు కథానుగుణంగా సాగడంతో పాటు, కథను చెబుతాయి కూడా. అందుకే శేఖర్ కమ్ముల చిత్రాల్లోని పాటలు ఓ ఆత్మీయ స్పర్శను అందిస్తాయి. అయితే శేఖర్ కమ్ముల మెలోడీ పాటలతో పాటు ఫిమేల్ ఓరియేంటెడ్ మాస్ సాంగ్స్ అందించడంలోనూ దిట్ట. ఈ క్రమంలో ‘ఫిదా’లో ‘వచ్చిండే’ ఆల్‌ టైమ్‌ హిట్‌ అయింది. ఇప్పుడు ‘లవ్‌ స్టోరి’ నుంచి వచ్చిన ‘సారంగదరియా’ కూడా ట్రెండింగ్‌లో ఉంది. అయితే సక్సెస్ రావడంతో ఈపాటపై వివాదం చెలరేగింది. అసలు విషయానికొస్తే..నిజానికి ఈ పాటను కొన్నేళ్ల క్రితం ‘రేలారే రేలా’ అనే ప్రోగ్రాంలో కోమలి అనే అమ్మాయి పాడింది. ఈ ప్రోగ్రాంకి జడ్జిగా సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. అయితే సుద్దాల అశోక్ తేజ ఈ పాటను సేకరించారని చిత్ర యూనిట్ చేసిన ప్రకటనపై కోమలి అనే అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తమ సినిమా కోసం ‘సారంగదరియా’ను వాడుకుంటున్నట్లు తనకు చెప్పిన సుద్దాల అశోక్ తేజ, పాటను తాను సేకరించినట్లుగా పేరు వేసుకోవడం అన్యాయమని వాపోయింది. ప్రోమో వచ్చాక శేఖర్ గారు తనను పాడతావా? అని అడిగారని.. కానీ గొంతు బాగా లేదని తెలిపింది. అయితే ఆడియో ఫంక్షన్‌లో పాడిస్తామని మాట ఇచ్చారని తెలిపింది. కానీ ఇప్పుడు మాట మార్చి తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో లైవ్‌లోనే కోమలి ఏడ్చేసింది. తన పాట మంగ్లీ ఎందుకు పాడాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఆమె చేసిన రెండు ఆరోపణలకు, చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. ఆ అమ్మాయిని పాడాలని అడగ్గా గొంతు బాగా లేదని చెప్పిందని అశోక్ తేజ వివరించగా, సుద్దాలతో పాటు, కోమలి పేరు కూడా క్రెడిట్స్‌లో జతచేసింది మూవీ యూనిట్. కనుక ఇందులో ఆమె పరమైన రెండు అంశాలు తేలిపోయాయి. మరి పాట హిట్ టాక్ సొంతం చేసుకోవడం వల్లే కోమలి ఇష్యూ చేయాలని అనుకుందా? లేక తను ఇంకే ఏమైనా ఆశిస్తుందా? తెలియదు.



Next Story