సూపర్ ఫుడ్.. బాంబూ షూట్స్

by  |
సూపర్ ఫుడ్.. బాంబూ షూట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భూమ్మీద పెరిగే అతి పొడవైన గడ్డిజాతి మొక్క.. వెదురు(Bmboo). వెదురుతో బాటిల్స్, టిఫిన్ బాక్స్, సైకిల్స్, పూల కుండీలు.. ఇలా ఇంటికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు తయారు చేయవచ్చని తెలుసు. కానీ, ఈ బాంబూ షూట్స్‌ (అప్పుడే మొలకెత్తిన వెదురు విత్తనాలు)తో ‘బిస్కెట్లు’ కూడా తయారు చేయొచ్చని, వీటిలో విలువైన పోషకాలు దాగున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే త్రిపుర రాష్ట్రం.. ఇటీవలే ‘బాంబూ కుకీస్’ను ఇంట్రడ్యూస్ చేసింది. అంతేకాదు, ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు వాడే సబ్బుల్లో వెదురును ఉపయోగించారు. మరి అలాంటి సూపర్ ఫుడ్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్.. ‘ప్రపంచ వెదరు దినోత్సవం (సెప్టెంబర్ 18)’ సందర్భంగా ‘బాంబూ కుకీస్’‌ను లాంచ్ చేశారు. ఎక్కువ పోషక విలువలతో లోఫ్యాట్ కలిగి ఉండే ఈ కుకీస్‌ను బాంబూ షూట్స్ పొడితో తయారుచేస్తున్నారు. డయాబెటిస్, క్యాన్సర్ బాధితులకు ఇవి ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బాంబూ షూట్స్‌ను.. నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, జపాన్, చైనా, థైవాన్ దేశీయులు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఇండియాలోనైతే నార్తిస్ట్‌లు వీటిని ఎక్కువగా తింటుంటారు. వీటితో రకరకాల కూరలు కూడా చేస్తారు. చైనీయులు.. సూప్స్, నూడుల్స్, సలాడ్స్‌లో వీటిని ఉపయోగిస్తుంటారు.

బాంబూ షూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లతో పాటు ఫాస్పరస్, కాపర్, జింక్, మెగ్నీషియం, కాల్షియం‌లు ఉంటాయి. 100 గ్రాముల బాంబూ షూట్స్‌లో 27 కేలరీల శక్తి ఉంటుంది. బి-కాంప్లెక్స్ గ్రూపు విటమిన్లు (థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ బి-6) పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇవి యాంటీ బయాటిక్, యాంటీ వైరస్, యాంటీ క్యాన్సరస్ గుణాలను కలిగి ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచడంలో సాయపడతాయి. త్రిపురలో ప్రస్తుతం 21 జాతుల వెదురు చెట్లను పెంచుతున్నారు. అందులో ఎక్కువగా ములి వెదురు రకమే ఉంటాయి.

బాంబూ షూట్స్ లేదా బాంబూ స్ప్రౌట్స్‌‌లో మొత్తంగా 17 ఎమైనో ఆమ్లాలు ఉన్నాయని.. వాటిలో 8 మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయని పరిశోధనల్లో వెల్లడైంది. 11 దేశాలకు చెందిన 25 మంది నిపుణులు ‘బాంబూ షూట్స్’ మీద పరిశోధనలు చేసి ‘న్యూట్రిషనల్లీ ఫంక్షనల్ ఫుడ్స్’ అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రొటీన్ విలువ 1.49 శాతం నుంచి 4.04 శాతం వరకు ఉంటుంది. వీటికి ప్రపంచవ్యాప్తంగా 1700 మిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ప్రతి ఏటా 3 మిలియన్ టన్నుల బాంబూ షూట్స్‌ను వినియోగిస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ మైక్రోబియల్ సోప్స్, హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసిన ఫిలిప్పినో శాస్త్రవేత్తలు.. వాటిల్లో ప్రధాన ఇంగ్రిడియెంట్‌గా ‘వెదురు’నే ఉపయోగించారు.

వెదురు విత్తనాలు పెట్టిన మూడు నాలుగు సంవత్సరాలకు బాంబూ షూట్స్.. భూమిని చీల్చుకుని పైకి ఎదుగుతాయి. మొలకెత్తడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా.. కేవలం ఆరు నెలల్లోనే వెదురు మొక్క ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుందన్న విషయం తెలిసిందే. కాగా, బాంబూ షూట్స్‌ను మొదట ఉడికించిన తర్వాతే.. వంటల్లో కానీ, ఇతర వాటిల్లో గానీ ఉపయోగిస్తుంటారు.


Next Story

Most Viewed