- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ రద్దు.. ఐపీఎల్ నుంచి ఎస్‌ఆర్‌హెచ్ ఎలిమినేట్
ఐపీఎల్-18 నుంచి సన్‌రైజర్స్ ఎలిమినేట్ అయ్యింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18 నుంచి సన్‌రైజర్స్ ఎలిమినేట్ అయ్యింది. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఉన్న కాసిన్ని ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలాడు. తొలి ఇన్నింగ్స్ తర్వాత భారీ వాన కురిసింది. చాలా సేపటి తర్వాత వర్షం తగ్గింది. మైదానం సిద్ధం చేయడానికి సమయం లేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గెలిస్తేనే హైదరాబాద్ రేసులో ఉండేది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీని హైదరాబాద్ బౌలర్లు 133 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. మ్యాచ్ జరిగి ఉంటే ఎస్‌ఆర్‌హెచ్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ, వర్షం అంతరాయం కలిగించడంతో హైదరాబాద్‌కు నిరాశ తప్పలేదు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి అంచనాలను అందుకోలేకపోయింది. ఘోరంగా విఫలమైంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే నెగ్గింది. ఇక, మిగతా మూడు మ్యాచ్‌లు నామమాత్రమే కానున్నాయి.
కమిన్స్ దెబ్బ.. ఢిల్లీ విలవిల
హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఢిల్లీ విలవిలలాడిపోయింది. అతి కష్టం మీద 133 రన్స్ చేసింది. మొదటి నుంచి ఆ జట్టు తడబడుతూనే ఆడింది. పాట్ కమిన్స్ ఢిల్లీని ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. తొలి బంతికే ఓపెనర్ కరుణ్ నాయర్(0)ను అవుట్ చేశాడు. డు ప్లెసిస్(3), అభిషేక్ పొరెల్(8)ను కూడా పెవిలియన్ పంపాడు. కమిన్స్ ధాటికి ఢిల్లీ 15 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థికి హైదరాబాద్ బౌలర్లు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ అక్షర్ పటేల్(6), కేఎల్ రాహుల్(10) కూడా నిరాశపరిచారు. దీంతో 29 రన్స్‌కే 5 వికెట్లు పడ్డాయి. ఢిల్లీ 50పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానాలు కలిగాయి. విప్రాజ్ నిగమ్(18) కూడా ఎంతో సేపు క్రీజులో నిలువలేదు. ఈ సమయంలో అశుతోష్ శర్మ(41), ట్రిస్టన్ స్టబ్స్(41 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. హైదరాబాద్ బౌలర్లను ధాటికి ఎదుర్కొని నిలబడ్డారు. స్టబ్స్ నిదానంగా ఆడగా.. అశుతోష్ దూకుడుగానే ఆడాడు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌లో అశుతోష్‌ను ఇషన్ మలింగ అవుట్ చేయగా.. స్టబ్స్ అజేయంగా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ 133 రన్స్‌కే పరిమితమైంది.






