18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-03 20:39:49  IST  )

18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 17 ఏళ్లు పరాజయాన్ని చూసిన ఆర్సీబీ.. ఈసారి ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆర్సీబీ గెలుపుతో దేశవ్యాప్తంగా అభిమానులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్స్ గా గెలిచిన అనంతరం విరాట్ కొహ్లీ గ్రౌండ్ లోకి వచ్చి టీమ్ ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
X

దిశ, వెబ్‌డెస్క్: 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 17 ఏళ్లు పరాజయాన్ని చూసిన ఆర్సీబీ.. ఈసారి ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆర్సీబీ గెలుపుతో దేశవ్యాప్తంగా అభిమానులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్స్ గా గెలిచిన అనంతరం విరాట్ కొహ్లీ గ్రౌండ్ లోకి వచ్చి టీమ్ ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల ఆశలను నెరవేర్చింది. ఈ విజయం ఆర్సీబీకి 18 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే ఇది వారి తొలి టైటిల్ విజయం.

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీని మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43 పరుగులు, 35 బంతులు) ఇన్నింగ్స్‌ను స్థిరంగా నడిపించగా, రజత్ పాటిదార్ (26), జితేష్ శర్మ (24), లియామ్ లివింగ్‌స్టోన్ (25) వంటి ఆటగాళ్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే, డెత్ ఓవర్లలో ఆర్సీబీ 45/5తో కొంత నిరాశపరిచింది. ఎందుకంటే పంజాబ్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్ రాణించారు. ఆఖరి ఓవర్లో అర్షదీప్ మూడు రన్లు ఇచ్చి , మూడు వికెట్లు తీయడంతో విరాట్ కొహ్లీ సైతం నిరుత్సాహపడిన దృశ్యాలు నెట్టింట దర్శనమిచ్చాయి.

పంజాబ్ కింగ్స్ ఛేజింగ్‌లో మొదటి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంది. ఆర్సీబీ బౌలర్లు, ముఖ్యంగా క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ను చాటున ఉంచారు. 10 ఓవర్లలో పంజాబ్ 81/3 వద్ద ఉండగా, క్రునాల్ పాండ్యా.. జోష్ ఇంగ్లిస్ (39), షెఫర్డ్.. శ్రేయాస్ అయ్యర్ (1) వంటి కీలక వికెట్లను పడగొట్టి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పారు. భువనేశ్వర్ కుమార్ నెహాల్ వధేరా (15), మార్కస్ స్టోయినిస్ (6) వికెట్లను తీసి పంజాబ్‌ను 17 ఓవర్లలో 144/6 వద్ద ఆపాడు.

ఇక 13వ ఓవర్లో కీలకమైన జోష్ ఇంగ్లిస్ (39) వికెట్ ను కూడా తీయడంతో పంజాబ్ కు గెలుపు ఆశలు మెల్లగా తగ్గిపోయాయి. కృనాల్ పాండ్య వేసిన బంతిని భారీషాట్ కొట్టేందుకు ప్రయత్నించి.. బౌండరీ లైన్ వద్ద లివింగ్ స్టోన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు జోష్ ఇంగ్లిస్. 16వ ఓవర్లో నేహాల్ వధేరా (13) వికెట్ కూడా పడిపోవడంతో పంజాబ్ ఫ్యాన్స్ నిరాశచెందారు.

చివరి ఓవర్లలో షషాంక్ సింగ్ పోరాడినప్పటికీ, ఆర్సీబీ బౌలర్లు జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను 190 పరుగుల లక్ష్యాన్ని చేరుకోనీయలేదు. ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఆర్సీబీ బౌలరల బలాన్ని, రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు యొక్క సమతుల్య ప్రదర్శనను ప్రతిబింబిస్తుంది.

కోహ్లీ 43 పరుగులతో ఇన్నింగ్స్‌ను స్థిరపరిచాడు, అయితే అతని స్ట్రైక్ రేట్ (122.85) కొంత నిరాశపరిచింది. అయినప్పటికీ, అతని ఇన్నింగ్స్ ఆర్సీబీకి గట్టి పునాది వేసింది. ఒకరకంగా క్రునాల్ పాండ్యా గేమ్ ఛేంజర్ గా నిలిచాడని చెప్పాలి. క్రునాల్ పాండ్యా రెండు కీలక వికెట్లతో (ఇంగ్లిస్, శ్రేయాస్) పంజాబ్ ఛేజ్‌ను దెబ్బతీశాడు. మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పాడు. భువనేశ్వర్ యార్కర్లు, స్లో బాల్స్‌తో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. ముఖ్యంగా నెహాల్ వధేరా వికెట్‌ను తీసి మరో విజయవంతమైన స్పెల్‌ను అందించాడు.

Next Story