సొంతగడ్డపై బెంగళూరు మళ్లీ బోల్తా.. పంజాబ్‌ను గెలిపించిన నేహాల్

by Harish |

సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ బోల్తా పడింది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది.

సొంతగడ్డపై బెంగళూరు మళ్లీ బోల్తా..  పంజాబ్‌ను గెలిపించిన నేహాల్
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ బోల్తా పడింది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్, ఢిల్లీ చేతుల్లో ఓడింది. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 7 గంటలకు పడాల్సిన టాస్ వర్షం కారణంగా 9:45 గంటలకు పడింది. దీంతో రెండు ఇన్నింగ్స్‌లను 14 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ను నిర్వహించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 95/9 స్కోరు చేసింది. టిమ్ డేవిడ్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక, 96 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నేహాల్ వధేరా(33 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ ఓవర్‌లో మలుపు

96 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా ఛేదన పంజాబ్‌కు మరి సులభంగా లేదు. లక్ష్యాన్ని ఛేదించడానికి కాస్త శ్రమించాల్సి వచ్చింది. ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య(16), ప్రభ్‌సిమ్రాన్(13) ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించినా త్వరగానే అవుటయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(7), జోష్ ఇంగ్లిస్(14) కూడా ఆకట్టుకోలేదు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్‌పై ఒత్తిడి పెరిగింది. 36 బంతుల్లో 43 రన్స్‌తో సమీకరణం ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నేహాల్ వధేరా మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. స్పిన్నర్ సూయశ్ శర్మను లక్ష్యంగా చేసుకుని పరుగులు పిండుకున్నాడు. 9వ ఓవర్‌లో వరుసగా 4, 4 దంచిన అతను.. అతనే వేసిన 11వ ఓవర్‌లో 6, 4, 4 బాదాడు. ఆ ఓవర్‌లో 15 రన్స్ రావడంతో మ్యాచ్ ఆర్సీబీకి దూరమైంది. తర్వాతి ఓవర్‌లో శశాంక్ సింగ్(1)ను భువనేశ్వర్ అవుట్ చేయగా.. ఆ ఓవర్‌లో నేహాల్ సిక్స్, ఫోర్ దంచి విజయాన్ని తేలిక చేశాడు. ఇక, పంజాబ్ విజయానికి 4 రన్స్ కావాల్సి ఉండగా 13వ ఓవర్‌లో తొలి బంతిని స్టోయినిస్(7 నాటౌట్) సిక్సర్ కొట్టి విజయాన్ని లాంఛనం చేశాడు.

ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు

అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ మినహా ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు. డేవిడ్ మెరుపులతోనే ఆర్సీబీ 95 పరుగులు చేయగలిగింది. లేదంటే ఒక దశలో 50 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. పంజాబ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బెంగళూరు ఆరంభం నుంచే తడబడింది. ఆరంభంలోనే అర్ష్‌దీప్ సింగ్ భారీ దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లో సాల్ట్(4)‌ను.. మరో ఓవర్‌లో కోహ్లీ(1)ని పెవిలియన్ పంపాడు. లివింగ్‌స్టోన్(4), జితేశ్(2), కృనాల్ పాండ్యా(1) కూడా తేలిపోవడంతో 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రజత్ పటిదార్(23) కాసేపు క్రీజులో నిలిచినా అతనికి చాహల్ చెక్ పెట్టాడు. కష్టాల్లో పడిన జట్టును టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను మిగతా వారిలా ఒత్తిడికి చిత్తవ్వలేదు. చివరి ఓవర్లలో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్‌లో ఏకంగా 21 రన్స్ పిండుకున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లతో రాణించి ఆర్సీబీని 100లోపే పరిమితం చేశారు.

Next Story