రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి ఇద్దరు సౌతాఫ్రికా స్టార్లు

by Harish |

ఐపీఎల్-18లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన చేస్తున్నది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి ఇద్దరు సౌతాఫ్రికా స్టార్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన చేస్తున్నది. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయింది. ఇక, చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలనుకుంటున్నది. ఈ క్రమంలో రాజస్థాన్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గాయాల కారణంగా లీగ్‌కు దూరమైన బ్యాటర్ నితీశ్ రాణా, బౌలర్ సందీప్ శర్మ స్థానాలను భర్తీ చేసింది. ఈ విషయాన్నిఐపీఎల్ వర్గాలు గురువారం వెల్లడించాయి. నితీశ్ స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డే ప్రిటోరియస్‌తో ఒప్పందం చేసుకుంది. అతనికి రూ.30 లక్షలు చెల్లించనుంది. ప్రిటోరియస్ 33 టీ20ల్లో 911 రన్స్ చేశాడు. మరోవైపు, రాణా ఈ సీజన్‌లో తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 217 రన్స్ చేశాడు.

బర్గర్‌కు రూ.3.5 కోట్లు

సందీప్ శర్మ కూడా గాయం కారణంగానే ఈ సీజన్‌కు దూరమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీయగా.. అతని వేలికి గాయమవడంతో టోర్నీని వీడక తప్పలేదు. సందీప్ స్థానాన్ని రాజస్థాన్ సౌతాఫ్రికాకే చెందిన పేసర్ నాండ్రే బర్గర్‌తో భర్తీ చేసింది. అతనితో ఫ్రాంచైజీ రూ.3.5 కోట్లతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గతేడాది రాజస్థాన్‌కే ఆడిన బర్గర్ 6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. మరి, అనుకోకుండా దక్కిన ఈ చాన్స్‌ను బర్గర్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఈ నెల 12న చెన్నయ్‌ సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ తలపడనుంది.

Next Story