IPL 2025 : ఫైనల్‌లో ఆర్సీబీని ఢీకొట్టేదెవరో?.. తాడోపేడో తేల్చుకోనున్న ముంబై, పంజాబ్

by Harish |

ఐపీఎల్-18లో భాగంగా నేడు క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎదురుపడనున్నాయి.

IPL 2025 : ఫైనల్‌లో ఆర్సీబీని ఢీకొట్టేదెవరో?.. తాడోపేడో తేల్చుకోనున్న ముంబై, పంజాబ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించి నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరో ఫైనలిస్ట్ ఖరారు కావాల్సి ఉంది. ఎలిమినేటర్‌‌లో గుజరాత్ టైటాన్స్‌ ఓడి టైటిల్ రేసు నుంచి తప్పుకుంది. గుజరాత్‌పై నెగ్గిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంది. టైటిల్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్‌తోపాటు పంజాబ్ కింగ్స్ పోటీపడుతుంది. నేడు ఇరు జట్ల మధ్య క్వాలిఫయర్-2 పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడుతుంది.

ఆత్మవిశ్వాసంతో ముంబై

ఎలిమినేటర్‌లో బలమైన గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడంతో ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నది. రోహిత్, సూర్యకుమార్‌లకుతోడు బెయిర్ స్టో రాకతో ఎంఐ బ్యాటింగ్ దళం మరింత బలోపేతమైంది. రికెల్టన్ స్థానంలో జట్టులోకి వచ్చిన బెయిర్ స్టో గుజరాత్‌పై 22 బంతుల్లో 47 రన్స్ చేశాడు. రోహిత్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 81 రన్స్ చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, పాండ్యా 22 రన్సే చేసిన ఆ పరుగులు ముంబై విజయంలో కీలకమయ్యాయి. అయితే, తిలక్, పాండ్యా నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నది. బౌలింగ్ పరంగా కూడా ముంబై పటిష్టంగానే కనిపిస్తున్నది. బుమ్రా, బౌల్ట్ ఎంఐకి కీలకం కానున్నారు. గ్లీసన్, సాంట్నర్ కూడా తోడైతే పంజాబ్ బ్యాటర్లకు సవాల్ తప్పదు. అయితే, లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ముంబై ఓడిపోయింది. 185 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కాబట్టి, పంజాబ్‌ను ముంబై తేలికగా తీసుకోవడానికి లేదు.

పంజాబ్ పుంజుకుంటుందా?

లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్‌ క్వాలిఫయర్-1లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. అయినా ఆ జట్టుకు ఫైనల్‌కు చేరుకోవడానికి మరో చాన్స్ ఉంది. అయితే, క్వాలిఫయర్-1లో ఆ జట్టు ప్రదర్శననే ఆందోళన కలిగిస్తున్నది. 101 పరుగులకే ఆలౌటవడంతో పంజాబ్ బ్యాటింగ్ బలంపై ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి. అయితే, ఆ ఆట ఆ మ్యాచ్‌కే పరిమితమైతే పర్వాలేదు. కానీ, క్వాలిఫయర్-2లోనూ రిపీట్ అయితే తొలి టైటిల్ గెలవాలన్న ఆశలు మరోసారి గల్లంతవుతాయి. గత మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్‌ విఫలమవడం జట్టు ఓటమిని శాసించింది. ముంబైపై వీరు పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రూపు మ్యాచ్‌లో ముంబైలో ప్రియాన్ష్, ఇంగ్లిస్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. మరోసారి వీరిద్దరూ అదే దూకుడును కొనసాగించాల్సిన అవసరం తప్పనిసరి. నేహాల్, స్టోయినిస్, శశాంక్ కూడా రాణించాల్సి ఉంది. 8వ స్థానం వరకు పంజాబ్‌‌కు బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం ఆ జట్టుకు బలమే. కానీ, ముంబై బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని ఏ మాత్రం నిలబడుతుందో చూడాలి. ఇక, బౌలింగ్ దళంలో అర్ష్‌దీప్, జాన్సెన్‌‌పై పంజాబ్ ఆధారపడి ఉన్నది.

హెడ్ టూ హెడ్‌లో సమవుజ్జీలే

హెడ్ టూ హెడ్ హిస్టరీలో ముంబై, పంజాబ్ జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో ఎదురుపడ్డాయి. అందులో ముంబై 17 విజయాలు నమోదు చేయగా.. పంజాబ్ 16 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అయితే, అహ్మదాబాద్‌లో పంజాబ్‌కే మెరుగైన రికార్డు ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయాలు నమోదు చేసింది. ఎంఐ ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది.

ప్లే ఆఫ్స్‌లో ముంబైదే రికార్డు

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ముంబైకి ఘనమైన రికార్డు ఉంది. 21 మ్యాచ్‌ల్లో 14 విజయాలు సాధించింది. అందులో ఐదుసార్లు ఫైనల్‌లో నెగ్గింది. మరోవైపు, పంజాబ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడింది తక్కువే. ఐదు మ్యాచ్‌లే ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

Next Story