IPL: ఐపీఎల్‌కు వెళ్లనివ్వరా?.. సొంత క్రికెట్ బోర్డుపై ఆర్సీబీ స్టార్ బౌలర్ కేసు!

by Ramesh Naini |

IPL: ఐపీఎల్‌కు వెళ్లనివ్వరా?.. సొంత క్రికెట్ బోర్డుపై ఆర్సీబీ స్టార్ బౌలర్ కేసు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడేందుకు ‘నిరభ్యంతర పత్రం’ (NOC) ఇవ్వకపోవడంపై శ్రీలంక స్టార్ పేసర్, ఆర్సీబీ ఆటగాడు నువాన్ తుషారా కొలంబో జిల్లా కోర్టును ఆశ్రయించాడు. తనకు వెంటనే ఎన్ఓసీ ఇచ్చేలా శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC)ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌లో ఎస్ఎల్‌సీ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారితో పాటు సీఈఓను ప్రతివాదులుగా చేర్చాడు.

ఆ సాకుతో అడ్డుకుంటున్నారు..

నిర్ణీత ఫిట్‌నెస్ ప్రమాణాలు లేవన్న సాకుతోనే బోర్డు తనకు ఎన్ఓసీ నిరాకరించిందని తుషారా ఆరోపించాడు. 2026 మార్చి 31తో బోర్డుతో తన కాంట్రాక్ట్ ముగిసిందని, దాన్ని పొడిగించుకునే ఉద్దేశం లేదని, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్నట్లు బోర్డుకు ముందే స్పష్టం చేశానని తెలిపాడు. గతం (2024, 2025)లో ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నప్పుడు ఐపీఎల్‌కు అనుమతిచ్చిన బోర్డు.. ఇప్పుడు జాతీయ జట్టుకు కూడా ఎంపిక చేయకుండా ఇలా అడ్డుకోవడం అన్యాయమని వాదించాడు. ఎన్ఓసీ రాకపోతే ఐపీఎల్‌లో ఆర్సీబీ తన స్థానంలో మరొకరిని తీసుకుంటుందని, తద్వారా భారీ ఆదాయంతో పాటు కెరీర్ అవకాశాలు కోల్పోతానని తుషారా ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే ఎన్ఓసీ మంజూరు చేసేలా బోర్డును ఆదేశించాలని కోర్టును అభ్యర్థించాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

Next Story