అల్లు అయాన్‌కు క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ స్పెషల్ గిఫ్ట్.. ఫోటోలు షేర్ చేసిన ఐకాన్ స్టార్

by Ramesh Naini |

సినీ, క్రికెట్ రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

అల్లు అయాన్‌కు క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ స్పెషల్ గిఫ్ట్.. ఫోటోలు షేర్ చేసిన ఐకాన్ స్టార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ, క్రికెట్ రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను భారత యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ, కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అల్లు అయాన్‌కు స్పెషల్ జెర్సీ.. బన్నీ థాంక్స్!

ఈ భేటీ సందర్భంగా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఒక ప్రత్యేకమైన స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన క్రికెట్ జెర్సీని (Signed Jersey) బహుమతిగా అందించారు. అయాన్‌కు ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చినందుకు గాను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.

ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

సినీ, క్రికెట్ ప్రపంచానికి చెందిన ఇద్దరు స్టార్స్ ఇలా కలిసి కనిపించడంతో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు క్రికెట్ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, క్రేజీ కామెంట్స్‌తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, వెంకటేశ్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అయ్యర్.. కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులు చేసి భారీ సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి చవిచూడగా, హైదరాబాద్ విజయం సాధించింది.

Next Story