ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సంపాదన వీరిదే!

by Malleboina Mahesh |

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సంపాదన ఆర్జించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ (₹230.2 కోట్లు) టాప్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సంపాదన వీరిదే!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం వేదికగా జరిగే ఐపీఎల్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ లీగ్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ లీగ్ ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు తో పాటు కాసుల వర్షం కురిపించడంలోనూ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటివరకు అత్యధిక సంపాదన (Highest-Paid) ఆర్జించిన టాప్-10 ఆటగాళ్ల జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో భారత క్రికెట్ దిగ్గజాలు, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మొదటి రెండు స్థానాల్లో నిలిచి రూ.200 కోట్ల క్లబ్‌లో రారాజులుగా వెలుగుతున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విరాట్ కోహ్లీ (Virat Kohli) రూ.230.2 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించి రోహిత్ శర్మ రూ.227.2 కోట్లతో రన్నరప్‌గా నిలిచారు. ఇక మహేంద్రసింగ్ ధోని రూ.200.3 కోట్లతో మూడో స్థానంలో నిలిచి తన మార్కును పదిలపరుచుకున్నారు. ఈ టాప్-3 దిగ్గజాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రూ.157 కోట్లతో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకోగా, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూ.137.8 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ వెటరన్ స్పిన్నర్ సునీల్ నరైన్ (రూ.137.2 కోట్లు) ఆరో స్థానంలో నిలిచి.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వీరి తర్వాత వరుసగా సంజూ శాంసన్ (రూ.126.5 కోట్లు), కేఎల్ రాహుల్ (రూ.126.1 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.126 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.122 కోట్లు) టాప్-10 సంపాదనపరుల క్లబ్‌ను పూర్తి చేశారు. కోట్లాది రూపాయల వేలంతో ఆటగాళ్ల తలరాతలను మార్చేసే ఐపీఎల్.. కేవలం వినోదాన్నే కాకుండా క్రీడాకారుల ఆర్థిక బలాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ఈ ఆల్-టైమ్ సంపాదనల పట్టిక స్పష్టం చేస్తోంది.

Next Story