IPL అవార్డుల్లో 'బేబీ బాస్' సూర్యవంశీ హవా

by Muthe.Rajitha |   (  Updated:2026-06-01 06:36:42  IST  )

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

IPL అవార్డుల్లో బేబీ బాస్ సూర్యవంశీ హవా
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో తన అద్భుత బ్యాటింగ్ విధ్వంసంతో ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను ఒకే సీజన్‌లో కైవసం చేసుకుని, ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 48.50 సగటుతో 776 పరుగులు సాధించి 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకున్నాడు. టోర్నీ పొడుగునా అత్యుత్తమ ప్రదర్శనతో 436.5 పాయింట్లు సాధించి 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' (MVP) గా నిలిచాడు. దాంతో పాటు, లీగ్‌లోనే బెస్ట్ యంగ్ టాలెంట్‌గా నిలుస్తూ 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ మూడు ప్రధాన అవార్డులను ఒకేసారి గెలిచిన ఏకైక ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.

ఇక బ్యాటింగ్ శైలి విషయానికొస్తే, ఏకంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టి 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే టోర్నీలో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది, గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ 'సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్' అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అసాధారణ ప్రదర్శనకు గాను వైభవ్‌కు అవార్డులతో పాటు భారీగా ప్రైజ్ మనీ లభించింది. ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులకు ఒక్కొక్క దానికి రూ. 10 లక్షల చొప్పున రాగా, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP) అవార్డుకు గాను రూ. 15 లక్షల నగదు బహుమతి లభించింది. 15 ఏళ్ల చిన్న వయసులోనే ఐపీఎల్ వేదికపై ఐదు అవార్డులతో వైభవ్ సూర్యవంశి సృష్టించిన ఈ ప్రభంజనం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఆరెంజ్ క్యాప్ హోల్డర్ వైభవ్.. పర్పుల్ క్యాప్ రబడా

Next Story