సొంతగడ్డపై సన్‌రైజర్స్ గర్జన.. చెన్నైని చిత్తు చేసిన SRH

by Muthe.Rajitha |

SRH, CSKతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

సొంతగడ్డపై సన్‌రైజర్స్ గర్జన.. చెన్నైని చిత్తు చేసిన SRH
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ సొంత మైదానంలో అద్భుత ప్రదర్శన చేసింది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు వేగంతో పరుగుల వరద పారించారు. వీరి ధాటికి ఒక దశలో స్కోరు 250 చేరుతుందా అనిపించినా, చెన్నై బౌలర్లు అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్‌టన్ అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగి తలా మూడు వికెట్లు తీశారు. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీస్తూ SRH ను 194 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే గెలుపు కోసం శ్రమించింది.

బ్యాటర్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినప్పటికీ, హైదరాబాద్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ఒత్తిడి పెంచారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు తీసి సన్ రైజర్స్ బౌలర్లు విజయాన్ని తమ వైపు తిప్పుకున్నారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ ఓటమి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ కు ఇది మూడో విజయం కాగా.. చెన్నైకి ఇది నాలుగో ఓటమి.

Next Story