Virat Fans: రెండేళ్ల తర్వాత నగరానికి రాక.. కోహ్లీ పేరుతో అభిమానుల అన్నదానం

by Ramesh Naini |

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరుతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Virat Fans: రెండేళ్ల తర్వాత నగరానికి రాక.. కోహ్లీ పేరుతో అభిమానుల అన్నదానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరుతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతేడాది ఆర్సీబీ తొలి ఐపీఎల్ కప్ గెలుచుకున్న ఆనందాన్ని పురస్కరించుకుని.. అలాగే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ నగరానికి రానున్న సందర్భంగా అభిమానులు ఈ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పేదలకు అన్నదానం చేసి తమ అభిమాన క్రికెటర్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

రసవత్తరంగా ప్లే ఆఫ్స్ రేసు..

మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ చివరికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 9 విజయాలు, 4 అపజయాలతో 18 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్ ఫేవరెట్‌గా బరిలో నిలిచింది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీతో తలపడే టాప్-2 స్థానం కోసం గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మే 22న ఉప్పల్‌లో అసలైన సమరం..

లీగ్ స్టేజ్‌లో భాగంగా మే 22న (శుక్రవారం) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా సరే 18 పాయింట్లతో టాప్-2లో నిలవడం దాదాపు ఖాయమే. అయినప్పటికీ, విజయంతో లీగ్ దశను ముగించి క్వాలిఫయర్-1కు వెళ్లాలని బెంగళూరు భావిస్తోంది. మరోవైపు, ఎలాగైనా సొంతగడ్డపై ఆర్సీబీ జోరుకు కళ్లెం వేసి టాప్-2లో నిలవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ పక్కా వ్యూహంతో సిద్ధమవుతోంది. దీంతో ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ పోరుపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story