బెంగళూరు వేదికగా నేడు RCB vs LSG సమరం

by Muthe.Rajitha |

నేడు బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

బెంగళూరు వేదికగా నేడు RCB vs LSG సమరం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ క్రమంలో నేడు బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌లో 23వ మ్యాచ్‌గా జరగనున్న ఈ పోరులో గెలుపు సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని దక్కించుకోవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి.

సొంత గడ్డపై ఆర్సీబీ జోరు కొనసాగిస్తుందా?

కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలోని RCB వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. అయితే ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ముంబైతో జరిగిన మ్యాచులో కోహ్లీకి గాయం కాగా.. ఫీల్డింగ్ కు సైతామ్ దూరం ఉన్నాడు. నిన్న సెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలికి పత్తితో కనిపించాడు. మ్యాచ్ సమయానికి గాని కోహ్లీ విషయం తేలనుంది. అటు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న బెంగుళూరు జట్టు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉండటంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

పుంజుకోవాలని చూస్తున్న లక్నో

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో మిశ్రమ ఫలితాలను అందుకుంది. గత మ్యాచ్‌లలో తడబడినప్పటికీ, ఆ జట్టులో రిషభ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటం ప్రత్యర్థికి సవాలుగా మారనుంది. బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తుండగా, రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయాల్లో వికెట్లు రాబడుతున్నారు. చిన్నస్వామి పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం కావడంతో, LSG బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

భారీ స్కోర్లకు పిచ్ అనుకూలం

చిన్నస్వామి స్టేడియం అంటేనే హై-స్కోరింగ్ మ్యాచ్‌లకు చిరునామా. బౌండరీలు చిన్నవి కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం వ్యూహాత్మకంగా మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆర్సీబీ బలమైన బ్యాటింగ్ లైనప్‌తో సొంత మైదానంలో పైచేయి సాధిస్తుందా? లేక లక్నో తన వ్యూహాలతో ఆర్సీబీకి షాక్ ఇస్తుందా? అనేది నేటి రాత్రికి తేలనుంది.

Next Story