IPL 2026: ఆగినట్టే ఆగి మళ్లీ ప్రారంభమైన వర్షం

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న 50వ లీగ్ మ్యాచ్‌కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది.

IPL 2026: ఆగినట్టే ఆగి మళ్లీ ప్రారంభమైన వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న 50వ లీగ్ మ్యాచ్‌కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 14 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేసి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వరుస వర్షపు జల్లుల మధ్య ఆట సాగినా, లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 49 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్న మార్ష్ (107 పరుగులు - 51 బంతులు, 9 ఫోర్లు, 9 సిక్సర్లు), ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయానికి మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్ (14 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

కులకుర్ణి అవుట్.. క్రునాల్‌కు ఒక వికెట్..

అంతకుముందు ఓపెనర్ అర్షిన్ కులకుర్ణి 17 పరుగులు చేసి క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ పాండ్యా ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు. ఇతర బౌలర్లు మార్ష్ దాడికి విలవిల్లాడారు. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ వేసిన 14వ ఓవర్లో మార్ష్ భారీ సిక్సర్ బాదడంతో లక్నో స్కోరు 145కు చేరింది. రాత్రి 9:15 గంటల సమయంలో వర్షం తగ్గడంతో ఆట మళ్లీ ప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ కవర్లు తొలగిస్తున్న క్రమంలోనే మళ్లీ వర్షం జోరందుకోవడంతో మైదాన సిబ్బంది వెంటనే పిచ్‌ను కవర్లతో మూసివేశారు. వర్షం ఇలాగే కొనసాగితే ఓవర్లను కుదించే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టేడియంలోని డ్రైనేజీ వ్యవస్థను ఉపయోగించి మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. వరుణుడు శాంతిస్తేనే ఈ మ్యాచ్ పూర్తి స్థాయిలో సాగే అవకాశం కనిపిస్తోంది.

Next Story