IPL 2026: పంజాబ్ కింగ్స్ 'రాయల్' విక్టరీ.. హైదరాబాద్‌కు మరో ఓటమి

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-11 13:47:05  IST  )

ఐపీఎల్ 2026లో మరో హై-స్కోరింగ్ థ్రిల్లర్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది.

IPL 2026: పంజాబ్ కింగ్స్ రాయల్ విక్టరీ.. హైదరాబాద్‌కు మరో ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో మరో హై-స్కోరింగ్ థ్రిల్లర్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అత్యంత అద్భుతంగా ఛేదించి, తమ సొంత గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంజాబ్ బ్యాటర్లు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (51) కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ పోటీపడి బాదుతూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడమే కాకుండా, తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (69) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒత్తిడిలోనూ చెలరేగి ఆడుతూ, చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తేలిపోయిన హైదరాబాద్ బౌలింగ్..

బ్యాటింగ్‌లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్.. బౌలింగ్‌లో మాత్రం మరోసారి విఫలమైంది. పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమవడంతో భారీ స్కోరు చేసినా ఓటమి తప్పలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదనల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ చూపించిన పట్టుదల చూసి క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో హైదరాబాద్ ఓపెనర్లు ఎలాగైతే రెచ్చిపోయారో, అదే స్థాయిలో పంజాబ్ ఓపెనర్లు బదులివ్వడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

SRH: 219/6(20)

PBKS: 223/4(18.5)

Next Story