ప్రియాన్ష్‌, శ్రేయాస్ మెరుపు హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!

by Ramesh Naini |

ధర్మశాలలో జరుగుతున్న ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది.

ప్రియాన్ష్‌, శ్రేయాస్ మెరుపు హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధర్మశాలలో జరుగుతున్న ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (56; 33 బంతుల్లో) విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్‌ప్లేలోనే పంజాబ్ స్కోరును 70 దాటించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18)తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్.. చివర్లో మెరుపులు

ప్రియాన్ష్ అవుటైన తర్వాత బాధ్యత తీసుకున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (59 నాటౌట్; 36 బంతుల్లో) ఆఖరి వరకు నిలబడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి కూపర్ కొన్నొల్లీ (38) చక్కని సహకారం అందించాడు. ఆఖరి ఓవర్లలో సూర్యాన్ష్ షెడ్గే (21 నాటౌట్) వేగంగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 మార్కును దాటింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో స్టార్క్ వరుస బంతుల్లో స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0)లను అవుట్ చేసి పంజాబ్‌ను దెబ్బతీశాడు. అయితే, ఎంగిడి వేసిన చివరి ఓవర్‌లో పంజాబ్ కేవలం 7 పరుగులే చేయగలిగింది. ముకేశ్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.

Next Story