కీలక పోరుకు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు దూరమైన స్టార్ ప్లేయర్

by Harish |

కీలక పోరుకు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు దూరమైన స్టార్ ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రఘువంశీ గాయం కారణంగా ఐపీఎల్-2026‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం కేకేఆర్ ధ్రువీకరించింది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. ఎంఐ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌లో తిలక్ క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో రఘువంశీ, సహచరుడు వరుణ్ చక్రవర్తి పరస్పరం ఢీకొట్టుకున్నారు. అప్పుడు తన తలకు తీవ్రమైన గాయమైంది. అలాగే, కుడి చేతి వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో 14వ ఓవర్‌లో మైదానం వీడిన అతను తిరిగి రాలేదు. అతని స్థానంలో తేజస్వి దహియా సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. ఆదివారం కేకేఆర్ తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ గేములో గెలిస్తేనే కోల్‌కతా ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇంతటి కీలకమైన పోరుకు రఘువంశీ లేకపోవడం కేకేఆర్‌కు భారీ దెబ్బే. ఈ సీజన్‌లో రఘువంశీ కోల్‌కతా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 422 రన్స్ చేశాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేకేఆర్ తరపున అతనే టాప్ స్కోరర్ కావడం గమనార్హం.


Next Story