IPL ఫైనల్ అహ్మదాబాద్‌లో.. కర్ణాటక క్రికెట్ బోర్డు ఫైర్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ కు చేరుకుంటున్న వేళ క్రీడా రాజకీయాల్లో వివాదాలు రేగుతున్నాయి.

IPL ఫైనల్ అహ్మదాబాద్‌లో.. కర్ణాటక క్రికెట్ బోర్డు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ కు చేరుకుంటున్న వేళ క్రీడా రాజకీయాల్లో వివాదాలు రేగుతున్నాయి. ఐపీల్ లో అత్యంత కీలకమైన ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికల విషయంలో BCCI తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. తొలుత షెడ్యూల్ ప్రకారం మే 31న జరగాల్సిన గ్రాండ్ ఫైనల్‌కు బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎం. చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను ధరంసాల, న్యూ చండీగఢ్‌లకు కేటాయించడంపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

తమ స్టేడియం అన్ని రకాల మెగా ఈవెంట్లను నిర్వహించడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి లోటుపాట్లు లేవని తాము బోర్డుకు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, ఈ విధంగా మ్యాచ్‌లను తరలించడం తమను ఎంతగానో నిరుత్సాహపరిచిందని KSCA ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ వివాదంపై KSCA అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగి బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. వేదిక మార్పుకు సంబంధించి బీసీసీఐ నుండి తమకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణలు అందలేదని, కేవలం 'ఆపరేషనల్, లాజిస్టికల్' కారణాల వల్లే ఈ మార్పు చేస్తున్నట్లు బోర్డు సమాచారం ఇచ్చిందని అసోసియేషన్ ఆరోపించింది. అయితే, తెరవెనుక అసలు కారణం బెంగళూరులో చెలరేగిన టిక్కెట్ల వివాదమేనని (Ticket Row) బలంగా వినిపిస్తోంది.

స్థానిక ఎమ్మెల్యేలకు ఉచిత టిక్కెట్లు కేటాయించడం మరియు విపరీతమైన వీఐపీ కోటా ఒత్తిడి కారణంగా మ్యాచ్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు బోర్డు భావించినట్లు తెలుస్తోంది. ఇలాంటి రాజకీయ చిక్కుల వల్ల క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని భావించిన బీసీసీఐ, కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు వంటి క్రికెట్ క్రేజ్ ఉన్న నగరంలో ఫైనల్ చూడాలనుకున్న లక్షలాది మంది అభిమానులు బీసీసీఐ నిర్ణయంతో నిరాశలో మునిగిపోయారు.

Next Story