- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోల్‌కతా బోణీ కొట్టేనా? చతికిల పడేనా?
IPL 2026 సీజన్‌లో సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్‌లో సోమవారం సాయంత్రం ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్(PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య పోరు జరగనుంది. పంజాబ్ తొలి రెండు మ్యాచుల్లో ఆడి విజయం నమోదు చేయగా.. కోల్‌కతా రెండు మ్యాచులూ ఆడి వరుస ఓటములను మూటగట్టుకుంది. ముఖ్యంగా కోల్‌కతా జట్టును ఆటగాళ్ల గాయాలు, గైర్హాజరు తీవ్రంగా వేధిస్తున్నాయి. ముస్తాఫిజుర్ రెహ్మాన్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, పతిరన వంటి కీలక బౌలర్లు జట్టుకు అందుబాటులో లేకపోవడంతో కేకేఆర్ బౌలింగ్ విభాగం పూర్తిగా బలహీనపడింది.
అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ జట్టుకు ఈ సీజన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై బ్యాటర్లు రాణించి భారీ స్కోరు చేసినా, బౌలర్లు విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ తడబడి పరాజయం చవిచూసింది. స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోతుండటం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బగా మారింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లోనైనా బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుని గెలవాలని చూస్తున్నారు.
ఇక శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన పంజాబ్, రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో బలంగా కనిపిస్తున్న పంజాబ్, కేకేఆర్‌పై గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మరి పంజాబ్ కింగ్స్ తన విజయ పరంపరను కొనసాగిస్తుందా? లేక కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా పుంజుకుని తమ పరువు నిలుపుకుంటుందా? అనేది చూడాలి.






