ముంబై ఇండియన్స్ జట్టులో ఏం జరుగుతుంది?.. జట్టుతో కలవని కెప్టెన్ పాండ్యా

by Harish |

ముంబై ఇండియన్స్ జట్టులో ఏం జరుగుతుంది?.. జట్టుతో కలవని కెప్టెన్ పాండ్యా
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేయనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో యాజమాన్యం అతన్ని పక్కనపెట్టిందన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు అతను అందుబాటులో లేడు. ఇప్పుడు తర్వాతి మ్యాచ్‌ కోసం రాయ్‌పూర్‌కు జట్టుతో కలిసి వెళ్లకపోవడం ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. ఎంఐ వర్గాలు పాండ్యా వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని చెబుతున్నా.. తాజాగా అతను జట్టుతో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ సీజన్‌లో పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా కోల్పోయింది. అతను నాయకత్వంలో 9 మ్యాచ్‌లు ఆడితే.. అందులో రెండింట మాత్రమే గెలిచింది. గత గేముకు పాండ్యా గైర్హాజరవ్వగా.. సూర్యకుమార్ సారథ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో ముంబై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో మిగతా సీజన్‌కు సూర్యనే కెప్టెన్‌గా ఉండాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా నిరాశపరుస్తున్ానడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 146 రన్సే చేసిన అతను.. కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఆర్సీబీపై 40 రన్స్ చేయడం మినహా అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అటు కెప్టెన్‌గా, ఇటు ప్లేయర్‌గా విఫలమవుతుండటంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. లక్నోతో మ్యాచ్‌కు ముందు సూర్య మాట్లాడుతూ.. పాండ్యా వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో ఈ గేము ఆడటం లేదని తెలిపాడు. ఎంఐ ఓపెనర్ రికెల్టన్ కూడా అతని నడుము పట్టేసిందని తెలిపాడు. అయితే, అతను ఎప్పుడు తిరిగి వస్తాడో మాత్రం తనకు తెలియదని సమాధానమిచ్చాడు.

ఈ నెల 10న ఎంఐ తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై ప్లేయర్లు బుధవారం రాయ్‌పూర్‌కు బయల్దేరారు. కానీ, ఆ బృందంలో పాండ్యా కనిపించలేదని జాతీయ మీడియా పేర్కొంది. జట్టుతో పాండ్యా లేకపోవడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. నిజంగా గాయంతోనే అతను లక్నోతో మ్యాచ్‌కు దూరమయ్యాడా? లేదా యాజమాన్యం అతనిపై వేటు వేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎంఐ అధికారికంగా స్పందిస్తేనే ఓ క్లారిటీ వస్తుంది.


Next Story