GT Vs PK: వైశాఖ్, చాహల్ మ్యాజిక్.. 162 పరుగులకే పరిమితమైన గుజరాత్

by Kema Shiva Kumar |

IPL 2026‌లో భాగంగా ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

GT Vs PK: వైశాఖ్, చాహల్ మ్యాజిక్.. 162 పరుగులకే పరిమితమైన గుజరాత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ 4వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి గుజరాత్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

రాణించిన గిల్, బట్లర్

గుజరాత్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా ప్రారంభించాడు. గిల్ 27 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసి మంచి పునాది వేశాడు. మరోవైపు సీనియర్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చడంలో విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ (25) మెరుపులు మెరిపించినా, మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో వైశాఖ్ విజయ్‌కుమార్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి గుజరాత్ వెన్ను విరిచాడు. వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా 2 వికెట్లతో కీలక సమయంలో వికెట్లు తీసి పంజాబ్‌కు పైచేయి అందించాడు. పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే ఇప్పుడు 120 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. హోమ్ గ్రౌండ్‌లో పంజాబ్ బ్యాటర్లు ఈ టార్గెట్‌ను ఛేదిస్తారో.. లేదో చూడాలి మరి.

Next Story