హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్: ప్లే ఆఫ్స్ రేసులో ఆ జట్లకు డేంజర్ బెల్స్!

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్: ప్లే ఆఫ్స్ రేసులో ఆ జట్లకు డేంజర్ బెల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ పోరులో రోహిత్ తన పాత రోజులను గుర్తు చేస్తూ ఆడిన ఇన్నింగ్స్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు కావడం ఖాయమని ఆయన హెచ్చరించారు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (83)తో కలిసి తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.

గావస్కర్ ఏమన్నారంటే..?

స్టార్ స్పోర్ట్స్ విశ్లేషణలో పాల్గొన్న సునీల్ గావస్కర్, రోహిత్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. "గత ఏడాది కాలంగా నేను రోహిత్‌ను నిశితంగా గమనిస్తున్నాను. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక రోహిత్ తన బ్యాటింగ్ పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అతని షాట్లలో స్పష్టత కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉండవచ్చు. కానీ, రోహిత్ శర్మ ఇదే జోరును తర్వాతి మ్యాచుల్లోనూ కొనసాగిస్తే.. ముంబై ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయడం ఖాయం. హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి వస్తే ఎంతటి భారీ లక్ష్యాన్ని అయినా ముంబై సులువుగా ఛేదించగలదు. లక్నోతో మ్యాచ్‌లో రోహిత్ ఆడిన పుల్ షాట్లు అద్భుతం. షార్ట్ పిచ్ బంతులను అలవోకగా స్టాండ్స్‌లోకి పంపాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ ఎంతో పరిణతి చూపించాడు." అని గావస్కర్ విశ్లేషించారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 3 విజయాలు నమోదు చేసి 6 పాయింట్లతో ఉంది. అయితే రోహిత్, రికెల్టన్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడంతో రాబోయే మ్యాచుల్లో ముంబై 'జయింట్ కిల్లర్'గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story