లఖ్‌నవూపై ఢిల్లీ సూపర్ విక్టరీ

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి విజయాన్ని నమోదు చేసింది.

లఖ్‌నవూపై ఢిల్లీ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ (LSG)తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే కోలుకోలేని షాక్‌లు తగిలాయి. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ డకౌట్ తో వెనుదిరగగా, పాథుమ్ నిశాంక (1), నితీశ్ రాణా (15) కూడా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు కేవలం 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో ఢిల్లీ ఓటమి ఖాయమని అందరూ భావించగా.. క్లిష్ట సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి వచ్చిన యువ సంచలనం సమీర్ రిజ్వీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

ఒత్తిడిని ఏమాత్రం లెక్కచేయకుండా బాధ్యతాయుతంగా ఆడిన రిజ్వీ, కేవలం 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (39*) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే, లఖ్‌నవూ బౌలర్లపై విరుచుకుపడి 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. లఖ్‌నవూ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీసినప్పటికీ, రిజ్వీ-స్టబ్స్ జోడీని విడదీయడంలో విఫలమవ్వడం వారి ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ గెలుపుతో దిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఘనంగా బోణీ కొట్టింది.

Next Story