IPL 2026 : రాహుల్ రికార్డుల మోత.. ధోనీ, తిలక్ రికార్డులు గల్లంతు

by Harish |

IPL 2026 : రాహుల్ రికార్డుల మోత.. ధోనీ, తిలక్ రికార్డులు గల్లంతు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 152 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఆట చూసిన వారెవరైనా ‘ఏం ఆడారు బాబు’ అనాల్సిందే. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఆ బౌలర్..ఈ బౌలర్ అని తేడా లేకుండా పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో 20 రన్స్ పిండుకుంటే.. విజయ్‌కుమార్ బౌలింగ్‌లో 6, 6, 6, 4 దంచి 24 రన్స్ రాబట్టాడు. ఇతర బౌలర్లను కూడా వదల్లేదు. దీంతో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ.. మరో 21 బంతుల్లో అంటే 47 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. మొత్తంగా 67 బంతుల్లో 152 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత ప్లేయర్‌గానూ నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనత తిలక్(151) పేరిట ఉండగా.. తాజా విధ్వంసంతో అతన్ని అధిగమించాడు. అలాగే, ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో ధోనీ(5439), సురేశ్ రైనా(5528)లను వెనక్కి నెట్టి 5వ స్థానంలో నిలిచాడు. అతనికితోడు నితీశ్ రాణా కూడా 44 బంతుల్లో 91 రన్స్ చేసి చెలరేగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు.

Next Story