'లెక్కకురాని' మనుషుల బతుకు పోరు

by  |
లెక్కకురాని మనుషుల బతుకు పోరు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశమెంతో ప్రగతి సాధించినా.. తనకంటూ గజం భూమి లేనోళ్లు.. లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టినా.. ఉండేందుకు ఇళ్లు లేనోళ్లు.. దేశంలో బిలియనీర్లు sపెరుగుతున్నా.. పొద్దున పనికెళ్తేనే రాత్రి నోటికి ముద్ద అందనోళ్లు.. కనీసం ప్రభుత్వం ప్రకటించే రిలీఫ్ ప్యాకేజీల వివరాలు తెలియనోళ్లు.. భవిష్యత్ అంటే రంగుల కలలు కాదు, ఇంకొన్ని రోజులు ఈ పని చేసుకుని బతికితే చాలు అనుకునేవాళ్లు ఈ లాక్‌డౌన్ కాలంలో చావుబతుకుల మధ్య నలిగిపోతున్నారు. పొట్ట చేతిన పట్టుకుని ఎక్కడ పని దొరికితే అక్కడే సర్దుకుని సంసారాన్ని వెళ్లదీసే కుటుంబాలు పాతాళానికి పడిపోతున్నాయి. ప్రభుత్వం చెప్పే అధికారిక లెక్కల్లో వారి లెక్కలుండవు. రిలీఫ్ ప్యాకేజీల ప్రకటనలు విడుదలవుతాయి. కానీ, వారి దరికి చేరవు. వారికి ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా చూసుకుంటామని, అన్ని సరుకులు, అవసరాలను ఇంటికే డెలివరీ చేస్తామని సర్కారులు చెబుతాయి. కానీ, సొంతిళ్లే లేనివాళ్లెందరు? ఏ పని ఎన్ని రోజులు చేస్తామో గ్యారంటీ లేని వారి వృత్తులు ఏ చిట్టాలో నమోదవుతాయి?

ఇంకొన్నాళ్లు బతికితే చాలు..

దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్, సూపర్ లాక్‌డౌన్(హాట్‌స్పాట్‌లను గుర్తించి సీల్ చేసిన చోట్లు) అమలవుతున్నాయి. యూపీలో 15 చోట్ల ఈ సూపర్ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు సీల్ చేయబడిన షామ్లీ జిల్లాలో మూడు రోజుల క్రితం సామాజిక కార్యకర్తలు హిమాన్షు, దీపక్‌లు ఓ వీడియో తీశారు. అందులో ఓ వృద్ధుడు రోడ్డు పక్కనే ఉన్న మురికి నాళా నుంచి పడేసిన బొప్పాయి పండు ముక్కలు ఏరుకుని కొంచెం కొంచె తింటూ కనిపించాడు. 24వ తేదీ నుంచి పని లేదు.. పైసలు లేవు. కానీ, ఆకలి ఆగదు కదా? ఆ అభాగ్యుడి ఆకలి ఏ ప్రభుత్వానికి అధికారిక లెక్కల ప్రకారం కనిపిస్తుంది. కోర్టులోనూ వలస కార్మికుల బాగోగులను వంద శాతం చూసుకుంటాయని ప్రభుత్వాలు చెబుతాయి. కానీ, సొంతగూడు లేని.. రెక్కల కష్టాన్ని అమ్ముకుని కడుపు నింపుకునేవాడి పరిస్థితి అంతగా ప్రచారంలోకి రాకపోవచ్చు. అందుకే, ఆ వృద్ధుడి కష్టాలు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించలేదేమో? కొందరు ఆ వీడియో ఫేక్ వీడియో అని సర్కారుకు వత్తాసూ పలకనువచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు, సబ్బులు అమ్మే చిన్న దుకాణంలో, చౌక దుస్తులు, చెప్పులు, ఫర్నీచర్, ఇంటి సామగ్రి అమ్మే దుకాణాల్లోని వర్కర్లను ఈ లాక్‌డౌన్ కాలంలో అవి పోషించలేవు. కొన్నాళ్లు భరించినా.. వారం పదిరోజులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితే. రోటీ లేదు కదా అని నీళ్లు వేడి చేసుకుని ఉప్పేసుకుని చాయ్‌లాగా తాగుతున్నవారిని చూశామని యూపీలో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్న ఓ సంస్థ తెలపడం అట్టడుగు కార్మికుల దైన్యాన్ని వెల్లడిస్తున్నది. వీళ్లు.. ఇంకొన్నాళ్లు బతకాలి అనే‘పేద్ద’ ఆశయాన్ని కలిగి ఉన్నోళ్లని ఆ సంస్థ వివరించింది. అందుకే… మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దగ్గర కావలసినతం ధాన్యమున్నదని, రేషన్ కార్డులు ఇతర కండీషన్‌లు పెట్టకుండా రేషన్ షాపు‌లకు వచ్చేవారందరికి ఆహారాన్ని పంచిపెట్టాలని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రీజ్ సూచించారు.

1.7 లక్షలకోట్ల ప్యాకేజీ.! నిజంగా మా కోసమా?

ఇప్పటికి 92 శాతం మంది వర్కర్లు వారం నుంచి మూడు వారాల వరకు పనిలేక అల్లాడిపోతున్నారని అట్టడుగువర్గాల హక్కుల కోసం పోరాడే జన్ సాహస్ అనే సంస్థ తెలిపింది. సగానికి ఎక్కువ మందికి లాక్‌డౌన్ తర్వాత కూడా కూలీ దొరకడం కష్టమని మధ్య, ఉత్తర భారతంలో 3,196 మందిని సర్వే చేసిన ఈ సంస్థ పేర్కొంది. కేంద్రం ప్రకటించిన రూ. 1.7 లక్ష కోట్ల ప్యాకేజీతోనూ ఈ కూలీలందరూ ఊరట పొందబోరని తెలిపింది. బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్(బీఓసీడబ్ల్యూ) వర్కర్ వెల్ఫేర్ ఫండ్ అందులో రిజిస్టర్ అయిన వర్కర్లకు ఆర్థిక సహాయాన్ని సర్కారు అందిస్తుంది. కానీ, ఈ సంస్థ సర్వే చేసినవారిలో కేవలం 18శాతం మందికే ఈ బీఓసీడబ్ల్యూ కార్డులుండటం గమనార్హం. జన్ సాహస్ లెక్కల ప్రకారం.. 66వేల కార్మికులలో 94శాతం మందికి ఈ కార్డులు లేవు. అందులో 60శాతం మందికి సర్కారు ప్రకటన గురించే తెలియదు లేదా ఎలా పొందాలో తెలియదు. సర్వే చేసిన 40శాతం మంది వలస కార్మికులకు అసలు రేషన్ కార్డులూ లేనేలేవు. అటువంటి లెక్కకురాని మనుషుల బతుకులు ఈ లాక్‌డౌన్ కాలంలో పూట పూట ఓ గండాన్ని గట్టెక్కినట్టుగా సాగుతున్నది.


Next Story

Most Viewed