పెట్టుబడిదారుల గుప్పిట్లో బేరగాళ్లు..

by  |
పెట్టుబడిదారుల గుప్పిట్లో బేరగాళ్లు..
X

దిశ, భద్రాచలం: చర్ల పశువుల సంత స్థానికేతర వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.‌ దీంతో బయటి నుంచి వచ్చే వ్యాపారులది అడిందే ఆట, పాడిందే పాటగా నడుస్తోంది. లోకల్ వ్యాపారులు బయట నుంచి వచ్చేవాళ్లకు పశువులు కొనిపెట్టే ఏజెంట్లుగా (మారుబేరగాళ్లుగా) మారి, పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలైనారు. వ్యాపారుల నడుమ పోటీ మూలంగా గతంలో పది లక్షలు ఉన్న పశువుల సంత వేలం పాట ఇపుడు నలభై లక్షలకు చేరింది. వెనక ఉండి స్థానిక గిరిజనులతో అంత పెద్ద మొత్తంలో పాట పాడించిన స్థానికేతర పశువుల వ్యాపారులు ఆ సొమ్ము రాబట్టుకొని అత్యధిక లాభాలు గడించడం కోసం అనేక అడ్డదార్లలో ప్రయాణిస్తున్నారు.‌ వారు ప్రయాణించే అడ్డదార్లను రహదార్లుగా చేసుకోవడానికి ముడుపుల రూపంలో నగదు వెదజల్లుతున్నారు.‌ బయట నుంచి వచ్చే వ్యాపారులతో లోకల్ వ్యాపారులు ఆర్థికంగా సరితూగలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో పశువుల సంతపై పెత్తనం బయటి వ్యాపారుల గుప్పిట్లోకి పోయింది. ఇపుడు లోకల్ వాళ్ల చేతిలో ఉన్న మెయింట్‌నెన్స్ కూడా వచ్చే ఏడాది (ఏప్రిల్ 2021- మార్చి 2022) బయటవాళ్ల చేతిలోకిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

కష్టం వీళ్లది.. లాభం వాళ్లది..

లోకల్ వ్యాపారులు తమకు ఉన్న పరిచయాల ద్వారా ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంత గ్రామాలకు వ్యయప్రయాసలు పడుతూ వెళ్లి బేరంచేసి పశువులు కొనుగోలు చేసి చర్లకు చేరవేయడానికి పడరానిపాట్లు పడుతుంటే బయట నుంచి వచ్చే వ్యాపారులు వాటిని ఎంచక్కా లారీల్లో పట్టుకుపోయి రాష్ట్ర రాజధానిలో అమ్మి లక్షల్లో లాభాలు గడిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఓ విధంగా చెప్పాలంటే స్థానిక మారుబేరగాళ్ల శ్రమని బయట నుంచి వచ్చే వ్యాపారులు దోచుకుంటున్నారనేది నిజం. ఆ దోపిడి ఫలితంగానే పాట గతంలో కంటె నాలుగైదు రెట్లు పెరిగిందనేది యదార్థం. భారీగా పెరిగిన వేలంధరకి అనుగుణంగానే వ్యాపారం జరుగుతున్నట్లుగా సమాచారం. మరో నెలరోజుల్లో పాట గడువు ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం పాటకోసం బయటి వ్యాపారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

ఛత్తీస్‌గఢ్ టూ హైదరాబాద్ వయా చర్ల..

చర్లలో మేజర్ గ్రామపంచాయతీవారు నిర్వహించే పశువుల సంత గమ్మత్తుగా ఉంటుంది. సహజంగా సంత అంటే వారానికి ఓసారి జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే వారపుసంత అంటారు. కానీ చర్లలో పశువుల సంత ఏడాది పొడవునా ప్రతిరోజు జరుగుతుంది. దీనికి ఒక రోజు, టైమ్ అనేది లేదు. ఎక్కువగా అర్థరాత్రి లావాదేవీలు జరగడం గమనార్హం. ఇంతకీ చర్లలో సంత జరిగినా సంతకు పశువులు తీసుకొచ్చి అమ్మేవారుగానీ, కొనేవారుగానీ ఉండరు. చర్ల సంతకి వచ్చే సరుకు (పశువులు) అంతా చర్లని ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ గ్రామాల నుంచి వస్తుంది. ఇక్కడి మారుబేరగాళ్లుపోయి బజానా ఇచ్చి వస్తే, అడవి దారిలో వాగులు, వంకలు దాటించి పశువుల మందతో కలిసి నడుచుకుంటూ ఆదివాసీలే తోలుకొచ్చి బేరగాళ్లకి అప్పగించి వెళుతుంటారు. రాష్ట్ర సరిహద్దులు దాటించి రవాణా పత్రాలు లేకుండా వ్యాపారం చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ అడిగేవారు ఎవరన్నట్లుగా పశువుల వ్యాపారులు నిబంధనలకి పాతరేస్తున్నారు. ఇక్కడి పంచాయతీకి ఆదాయం వస్తున్నదని అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం‌లేదు.

ఛత్తీస్‌గఢ్ నుంచి పశువుల రవాణాకి బ్రేక్‌.. ?

ఛత్తీస్‌గఢ్ నుంచి పశువుల రవాణాకి బ్రేకులుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ గ్రామపంచాయతీల మీదుగా పశువులను తరలించడానికి వీల్లేదని ఇప్పటికే తిప్పాపురం, లక్ష్మీకాలనీ గ్రామ పంచాయతీల పాలకవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పశువుల సంత నిర్వహణకి తమకి కూడా అనుమతి ఇవ్వాలని, లేదంటే చర్లలో నిర్వహించే పాట ద్వారా వచ్చే ఆదాయంలో వాటా ఇవ్వాలని ఆయా గ్రామపంచాయతీల ప్రజాప్రతినిథులు పట్టుబడుతున్నారు. మరోవైపు సంత పేరుతో ఛత్తీస్‌గఢ్ నుంచి పశువులను (మూగజీవాలు) తీసుకొచ్చి హైదరాబాద్ కబేళాలకు తరలిస్తున్న కారణంగా చర్ల పశువుల సంత రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ కార్యకర్తలు, మూగజీవాల ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మార్చితో ప్రస్తుత పాట ముగియనున్నందున వచ్చే ఏడాదికి మళ్లీ పశువుల సంత వేలం జరపొద్దని పలు సంఘాలు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ విషయమై అవసరమైతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.


Next Story

Most Viewed