సుప్రీంకోర్టులో రేవంత్‌ రెడ్డికి చుక్కెదురు

222

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయం వ్యవహారంలో పర్యావరణ అనుమతుల అంశాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూసుకుంటుందని, హైకోర్టు తీర్పు ఏ రకంగానూ అడ్డు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత సచివాలయం కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించి పై వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ప్రస్తుత పిటిషనర్ భాగస్వామిగా లేనందున ఇప్పుడు విచారించలేమని స్పష్టం చేసింది. సచివాలయం కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసినందున ఆ ఆదేశాలపై స్టే ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని వాదిస్తూ, సచివాలయ కొత్త భవనాల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరమని, ఈ విషయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ విచారణలో ఉందని పేర్కొన్నారు. కానీ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి దాఖలైన వేరే పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రభావం ఎన్జీటీ పిటిషన్ విచారణపై పడిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో రేవంత్ రెడ్డి భాగస్వామిగా లేనందువల్ల ఇప్పుడు ఆ పిటిషన్‌ను విచారించలేమని స్పష్టం చేసి కొట్టివేసింది. అయితే ఎన్జీటీలో జరుగుతున్న పిటిషన్ విచారణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలుగానీ, విచారణ ప్రక్రియగానీ అడ్డు రాదని స్పష్టం చేసింది. సచివాలయ కొత్త భవనాలకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అనే అంశంపై ఎన్జీటీ నిర్ణయం వెలువరిస్తుందని వివరించింది.