‘సండే ఫండే’ను తలదన్నేరీతిలో చార్మినార్​ వద్ద విన్నూత్న కార్యక్రమం

72
Charminar1

దిశ, చార్మినార్: ఆదివారం ట్యాంక్​బండ్​పై నిర్వహించే ‘సండే ఫండే’కు మంచి స్పందన లభిస్తుండడంతో పాతబస్తీలోని చార్మినార్​వద్ద కూడా వినూత్న​కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రతిపాదనల మేరకు అధికార యంత్రాంగం ముందుకు కదలింది. ఈ నెల 17 నుంచి నెలలో కనీసం రెండు ఆదివారాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్​ వద్ద నగరవాసులు, టూరిస్టులను ఆకట్టుకునేలా ‘ఏక్ షామ్​చార్మినార్​కే నామ్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్​కుమార్.. హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ఓవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, పత్తర్​గట్టి కార్పొరేటర్​ సోహైల్​ఖాద్రీ, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ గజరావు భూపాల్, ట్రాఫిక్ ​డీసీపీ ఎల్ ఎస్ చౌహాన్, ఇతర అధికారులతో కలిసి గురువారం స్వయంగా చార్మినార్​ పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ​ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ వారాంతపు ట్యాంక్ బండ్​ను తలదన్నే రీతిలో చార్మినార్​ వద్ద నగర వాసులను, ముఖ్యంగా టూరిస్టులను ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఈ నెల 17న సాయంత్రం చార్మినార్​ వద్ద ముషాయిరాతోపాటు చిన్నారులకు డ్రాయింగ్ ​తదితర పోటీలను నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా చార్మినార్ ​పరసరాలను వీక్షించడానికి వచ్చేవారి కోసం ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారని ఆయన తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..