45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న ఇన్ఫోసిస్!

by  |
45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న ఇన్ఫోసిస్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. బుధవారం సంస్థ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఫ్రెషర్ల నియామకాల సంఖ్య 35,000 నుంచి 45 వేలకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా డిజిటల్ సాంకేతికతకు పెరుగుతున్న డిమాండ్‌కు తోడు అత్యధికంగా ఉన్న అట్రిషన్ రేటు(వలసల రేటు)ను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో టెక్నాలజీ నైపుణ్యానికి పెరుగుతున్న అవసరం, వలసల రేటును అదుపులో తెచ్చేందుకు నియామకాల లక్ష్యాన్ని కంపెనీ పెంచింది.

‘దేశీయంగా టెక్ పరిశ్రమలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొత్త గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నామని’ ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు స్పష్టం చేశారు. ఇదివరకు జూన్ త్రైమాసికంలో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరానికి 35 వేల నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇటీవల డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్, అట్రిషన్ రేటు వల్ల పరిశ్రమలో సవాళ్లను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రవీణ్ రావు వివరించారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల వలసల రేటు 12.8 శాతంగా ఉంది. వార్షిక ప్రాతిపదికన ఇది 20 శాతానికి పైగా ఉంది. ఇక, సెప్టెంబర్ చివరి నాటికి సంస్థలో మొత్తం 2,79,617 మంది ఉద్యోగులున్నారు.


Next Story

Most Viewed