తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ. 4,272 కోట్లు!

by  |
తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ. 4,272 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభం రూ. 4,272 కోట్లతో 12.4 శాతం వృద్ధిని సాధించినట్టు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3,802 కోట్లుగా నమోదు చేసింది. అలాగే, ఏకీకృత ఆదాయం 8.5 శాతం పెరిగి రూ. 23,665 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 21,803 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ప్రభావంతో వ్యాపారం సన్నగిల్లిందని, భారత ఐటీ సంస్థలు కూడా మార్చి నుంచి ఈ ప్రభావానికి లోనయ్యాయని కంపెనీ వెల్లడించింది. వ్యూహాత్మక వ్యయంతో కొవిడ్-19 పరిస్థితులను అంచనా వేశామని ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలంజన్ రాయ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నారు.

అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 13 వేల కోట్ల విలువైన ఒప్పందాలను ప్రకటించిందని తెలిపారు. “తొలి త్రైమాసిక ఫలితాల్లో వృద్ధి సాధించామని, ముఖ్యంగా క్లయింట్లకు ప్రాధాన్యత ఇచ్చామని, కరోనా సమయంలోనూ తమ ఉద్యోగులు అద్భుతమైన అంకితభావంతో పనిచేశారని’ ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ చెప్పారు. తొలి త్రైమాసిక ఫలితాలను అనుసరించి ఈ ఏడాది ఇదే పనితీరును అందిస్తామని, విజయవంతమైన ఒప్పందాలతో మరిన్ని విజయాలను అందుకుంటామని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed