కొనసాగుతున్న కృష్ణమ్మ ఉగ్రరూపం

44

దిశ, తెలంగాణ బ్యూరో: నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొంతమేర తగ్గినట్టే తగ్గి మళ్లీ వరద పెరుగుతోంది. కృష్ణమ్మ ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ఎగువన మళ్లీ వరద పెరిగింది. ఆల్మట్టికి 1.67లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో దిగువకు 1.79లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు రెండు లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. దిగువకు కూడా అంతే స్థాయిలో విడుదల చేస్తున్నారు. అటు బీమాపై ఉన్న ఉజ్జయినీ ప్రాజెక్టుకు సైతం వరద మళ్లీ పెరిగుతోంది. 63వేల క్యూసెక్కులు నమోదవుతున్నాయి. జూరాలకు సాయంత్రం వరకు కొంత వరద తగ్గింది. ఉదయం ఐదున్నర లక్షల క్యూసెక్కులు ఉన్నా రాత్రి వరకు 4.74 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. దిగువకు 4.68 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. అటు తుంగభద్రకు కూడా వరద పెరుగుతోంది. 47 వేలక్యూసెక్కులు వస్తుండగా దిగువకు అంతే విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఏడు లక్షల క్యూసెక్కులకు చేరింది. దిగువకు 5.66 లక్షలను వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.11 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 5.28 లక్షలక్యూసెక్కలు ఔట్ ఫ్లో ఉంది. పులిచింతల దగ్గర కూడా ఏడు లక్షలునమోదవుతోంది.

ఇటు గోదావరి నదిలో కూడా వరద కొనసాగుతోంది. సింగూరుకు 54వేల క్యూసెక్కులు వస్తున్నాయి. నిజాంసాగర్‌లోకి 50వేల క్యూసెక్కులు వస్తుండగా 48 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీకి లక్ష క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 81 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఎల్ఎండీకి 16 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 15వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర 1.14 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దిగువకు 1.10 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. గోదావరి బేసిన్ నుంచి శనివారం సాయంత్రం వరకు 3,503.490 టీఎంసీలు, కృష్ణా బేసిన్ నుంచి 903.957 టీఎంసీలు సముద్రంలోకి చేరాయి.