భారీ శుభవార్త చెప్పిన ఇండస్ఇండ్ బ్యాంక్

by  |
Indusind-bank1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ(నెలవారీ వాయిదా చెల్లింపు) సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ వెసులుబాటు వల్ల తమ ఖాతాదారులు ఎక్కువ మొత్తం కలిగిన లావాదేవీలను సులభంగా వాయిదాల రూపంలో చెల్లించే ప్రయోజనాలు పొందుతారని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు డెబిట్ కార్డు కలిగిన వినియోగదారులు ఏదేని స్టోర్ కానీ, వ్యాపార కేంద్రాల వద్ద స్వైప్ కానీ, ట్యాప్ చ్కానీ చేసి చెల్లింపులను పూర్తి చేయవచ్చు. కొత్తగా ప్రారంభించిన సదుపాయంలో భాగంగా బ్యాంకు ఖాతాదారులు 3 నెలల నుంచి 24 నెలల మధ్య కాలపరిమితితో ఈఎంఐలను ఎంపిక చేసుకోవచ్చని బ్యాంకు వివరించింది. డెబిట్ కార్డు కలిగిన కస్టమర్లు ఈఎంఐ సదుపాయాన్ని పొందే అర్హతను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ‘ దేశీయంగా తమ వినియోగదారులు మరింత సులభమైన సేవలను పొందేందుకు, ఇతర ప్రయోజనాల కోసం తాము ఈ సదుపాయాన్ని ప్రారంభించాం. ఖాతాదారులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని’ ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్, బిజినెస్ స్ట్రాటజీ హెడ్ చారు మాథూర్ చెప్పారు. ఖాతాదారులకు ఈ సదుపాయాలను అందించేందుకు బ్యాంకు మొత్తం 60,000 ఆఫ్‌లైన్ వ్యాపారులతో భాగస్వామ్యం చేసుకుంది. వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద రిటైలర్లు, హైపర్ మార్కెట్లు, మల్టీ బ్రాండ్ స్టోర్లతో పాటు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, హాస్పిటల్, ఫ్యాషన్ సహా ఇంకా ఇతర విభాగాల వారితో ఒప్పందం చేసుకున్నాం. పలు ఆన్‌లైన్ ఈ-కామర్స్ కంపెనీలతో కూడా భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు బ్యాంకు వెల్లడించింది.


Next Story

Most Viewed