ఇంద్రవెల్లి దండోరా ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో ఇంటిపోరు

by  |
TPCC Chief Revanth Reddy, Kokkirala Premsagar, Eleti Maheshwar Reddy
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పోరుగడ్డ ఇంద్రవెల్లి నుంచి దళిత దండోరా మోగించాలని భావించిన.. టీపీసీసీ రథ సారథి రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు మొదలయ్యాయి.. ఆదిలాబాద్ జిల్లా నుంచి పోరాటాలకు శ్రీకారం చుట్టిన ఆయనకు.. జిల్లా కాంగ్రెసులోని గ్రూపు విబేధాలు తలనొప్పిగా మారాయి.. మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావుకు ఇంద్రవెల్లి సభ బాధ్యతలు అప్పగించటం.. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసంతృప్తికి కారణమైంది.. మొదటి నుంచి ఇద్దరి మధ్య విబేధాలు ఉండగా.. పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. అలాంటిది పశ్చిమ ప్రాంతంలో తూర్పు నేత నాయకత్వంలో సభ నిర్వహణపై సరికొత్త వివాదానికి తెర లేపింది..!

ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత దండోరా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించగా.. అటు రాష్ట్ర కమిటీతో పాటు ఇటు జిల్లా నాయకుల్లోనూ కొత్త వివాదానికి తెరతీసింది. దళిత దండోరా నిర్వహించాలని రాష్ట్ర కమిటీలో చర్చించినప్పటికీ.. ఎక్కడి నుంచి, ఎప్పుడు మొదలు పెట్టాలనేది నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం ఇటీవల హైదరాబాదులోని చిరాన్ ఫోర్ట్లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో లక్షమంది దళితులు, గిరిజనులతో దళిత దండోరా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇంద్రవెల్లిలో ఆగస్టు 9న దళిత దండోరా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని.. ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నారని.. రాష్ట్ర కమిటీలోని కీలక నాయకులు అసంతృప్తికి కారణమైంది.

టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు.. ఇటీవల ఇద్దరు నేతలు కలిశారు. ఇంద్రవెల్లి దండోరాకు కొక్కిరాల నాయకత్వం వహిస్తారని టీపీసీసీ చీఫ్ ప్రకటించటంతో జిల్లా కాంగ్రెసులో మరో వివాదానికి దారి తీసింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మనుగా ఉన్న తనతో సంప్రదించకుండానే.. ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఏలేటి మహేశ్వర్రెడ్డి కినుక వహించారు. కొక్కిరాల, ఏలేటి మధ్య మొదటి నుంచి గ్రూపు రాజకీయాలు నడుస్తుండగా.. తాజాగా.. పశ్చిమ ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి తూర్పు ప్రాంత నాయకుడికి బాధ్యతలు అప్పగించటం ఏంటనే వాదన తెరపైకి తెచ్చారు. కొక్కిరాల ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాయకుడు కాదని.. పెద్దపల్లి పార్లమెంట్ నాయకుడని.. ఉమ్మడి జిల్లా బాధ్యతలు లేకున్నా.. పశ్చిమ ప్రాంతంలోని ఇంద్రవెల్లి సభకు ఎలా నాయకత్వం వహిస్తారని ఏలేటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు మాజీమంత్రి షబ్బీర్ అలీ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఏలేటి అందుబాటులో లేకపోగా.. ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి. ఆదివారం రోజున బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. కొక్కిరాల వస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ సమావేశాలు పెట్టనుండగా.. వీటికి ఏలేటి వర్గం ఏ మేరకు సహకరిస్తుందనే చర్చ మొదలైంది.

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండగా.. అదే రోజున కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో దళిత దండోరా నిర్వహిస్తుండటంతో ఆదివాసీల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆదివాసీ దినోత్సవం రోజునే.. ఇంద్రవెల్లిలో దళిత దండోరా నిర్వహించటం సరికాదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయటమేనని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దళిత, గిరిజనుల పేరుతో దండోరా నిర్వహిస్తున్నారని.. లంబాడా, ఆదివాసీ గిరిజనులు ఎన్నో పోరాటాలు చేశారని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించటం పట్ల కూడా ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు లంబాడాలకు వ్యతిరేకంగా.. తమ హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నామని.. ఇద్దరికి ఒకే చోట కలపటం సరికాదంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ లంబాడాలు, ఆదివాసీల పట్ల తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆగస్టు 9న జరిగే దళిత దండోరాను అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. దళిత దండోరాకు ముందే ఇంద్రవెల్లి వివాదం కాంగ్రెస్ పార్టీకి అటు ఇంటిపోరు.. ఇటు ఆదివాసీల ఆగ్రహానికి కారణమైంది. ఇక ఇంద్రవెల్లిలో ఏర్పాట్ల పరిశీలనకు ములుగు ఎమ్మెల్యే సీతక్క వస్తున్నారు. ఈ సభకు ఏలేటి వర్గం నాయకులకు ఇంకా సమాచారం లేకపోగా.. నాయకులంతా ఏ మేరకు కలిసి వస్తారో చూడాలి.


Next Story

Most Viewed